WHO on Omricon | కరోనా ఒమిక్రాన్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆగ్నేయాసియా దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ హితవు చెప్పారు. ఇది డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరం అని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాతోపాటు పలు దేశాల్లో ఈ వేరియంట్ విరుచుకు పడుతున్నది. అనునిత్యం నిఘా పెంచాలని, ప్రజారోగ్య వ్యవస్థల్ని బలోపేతం చేయాలని ఖేత్రపాల్ సింగ్ చెప్పారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయడంతో విశ్వమారి వ్యాపించకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. కోవిడ్-19 మార్గదర్శకాలకు లోబడే పండుగలు,ఇతర వేడుకలు జరుపుకోవాలని, భౌతిక దూరం పాటించడంతోపాటు జన సమూహాలకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కరోనా మార్గదర్శకాలను పాటించే విషయంలో అలసత్వం పనికి రాదని స్పష్టం చేశారు.
ఆగ్నేయాసియా దేశాల్లో కరోనా కేసులు తగ్గుతున్నా.. పలు దేశాల్లో మహమ్మారి విజృంభించడం, పుట్టుకొచ్చిన కొత్త వేరియంట్లు ముప్పును గుర్తు చేస్తున్నాయని ఖేత్రపాల్‌సింగ్ చెప్పారు. ఈవేరియంట్ నుంచి రక్షణ కోసం, దాని వ్యాప్తి నివారణకు నిఘా పెంచాలని సూచించారు. అంతర్జాతీయ ప్రయాణాల ద్వారా, కొత్త వేరియంట్ల వ్యాప్తిపై వస్తున్న వార్తల సమాచారంతో తగు చర్యలు తీసుకోవాలన్నారు. ముక్కూ నోటిని కప్పివేసేలా మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు.
ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరుచుకుంటూ.. వెలుతురు లేని గదులకు దూరంగా ఉండాలని ఖేత్రపాల్ సింగ్ వివరించారు. ఖచ్చితంగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలన్నారు. ఇప్పటి వరకు ఆగ్నేయాసియా ప్రాంత జనాభాలో 31 శాతం మంది పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకోగా, 21 శాతం మందికి పాక్షికంగా టీకా అందిందన్నారు. మరో 48 శాతం ఇంకా టీకాలు వేయించుకోలేదన్నారు. అటువంటి వారికి వైరస్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.