సీనియర్ కాంగ్రెస్ నేత, సిట్టింగ్ ఎంపీ ఆస్కార్ ఫెర్నాండెజ్‌కు రాజ్యసభ ఘనంగా నివాళులర్పించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఉదయం సభ ప్రారంభం కాగానే కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆబిట్వరీ రిఫరెన్సెస్ చదివి వినిపించారు. ఇటీవల మరణించిన సిట్టింగ్ ఎంపీ ఆస్కార్ ఫెర్నాండెజ్‌తోపాటు మరో ఐదుగురు మాజీ ఎంపీలకు సభ నివాళులర్పించింది. అనంతరం సభ్యులంతా లేచి నిలబడి రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.
ఆ తర్వాత ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతికి గౌరవ సూచకంగా రాజ్యసభను ఒక గంటపాటు వాయిదా వేశారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, వ్యవసాయవేత్త అయిన ఆస్కార్ ఫెర్నాండెజ్ (88) గత సెప్టెంబర్ 13న కన్నుమూశారు. ఆయన మొత్తం నాలుగు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆస్కార్ ఫెర్నాండెజ్ మరణం ద్వారా దేశం ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిని, ప్రేమించదగిన వ్యక్తిని, అంకితభావంగల సామాజిక కార్యకర్తను, మంచి పరిపాలకుడిని, గొప్ప పార్లమెంటేరియన్‌ను కోల్పోయిందని వెంకయ్యనాయుడు సభలో చదివి వినిపించారు.
ఇక రాజ్యసభ మాజీ సభ్యుల్లో కేబీ శనప్ప (82) 2021 మే 9న, చందన్ మిత్ర (66) 2021 సెప్టెంబర్ 1న, హరిసింగ్ నల్వా (88) 2021 సెప్టెంబర్ 9న, మోనికా దాస్ (82) నవంబర్ 7న, అవనీ రాయ్ (82) నవంబర్ 25న మరణించారు.