వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021ను ఈ మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. లోక్‌సభలో ఈ ఉదయమే బిల్లును ప్రవేశపెట్టగా మూజువాణి ఓటింగ్ విధానంలో ఆ బిల్లును సభ ఆమోదించింది. అయితే దీనిపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తంచేశాయి. ఎలాంటి చర్చ జరుపకుండా వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ఆమోదించడాన్ని తప్పుబట్టాయి.
దీనిపై స్పందించిన ప్రహ్లాద్ జోషి.. వ్యవసాయ చట్టాలు పార్లమెంట్ ఆమోదం పొందినప్పుడే వాటిపై సమగ్రంగా చర్చ జరిగిందన్నారు. అయితే, ప్రతిపక్షాలన్నీ ఆ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశాయని, వారి డిమాండ్‌లను గౌరవించి ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తుంటే సభలో ప్రతిపక్షాలు గొడవ చేశాయని చెప్పారు. తాను ప్రతిపక్షాలను ఒక్కటే అడుగుతున్నానని, వారి ఉద్దేశం ఏమిటో చెప్పాలని వ్యాఖ్యానించారు.
ఈ విషయంలో ప్రభుత్వ ఉద్దేశం మాత్రం క్లియర్‌గా ఉన్నదని జోషి చెప్పారు. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదింపజేయాలని తాము నిర్ణయించాం. అందులో భాగంగానే బిల్లును లోక్‌సభ ఆమోదించింది. మధ్యాహ్నం రాజ్యసభ కూడా ఆమోదించనుంది. కాబట్టి ప్రతిపక్షాలు రాజ్యసభలో బిల్లు ఆమోదానికి సహకరించాలని కోరుతున్నాం అని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.