ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

మచ్చలేని రాజకీయ యోధుడు రోశయ్య: పవన్

మచ్చలేని రాజకీయ యోధుడు రోశయ్య అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొనియాడారు. ఆయన మరణం తెలుగు వారికి తీరని లోటన్నారు. నిష్కళంక రాజకీయ యోధుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారన్నారు. తనకు రోశయ్యతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. ఆయన మరణం తనను వేదనకు గురి చేసిందన్నారు. జనసేన పార్టీని స్థాపించిన తరువాత రెండు మూడుసార్లు కలిసినప్పుడు ఆయన తరకు ఎన్నో విలువైన సలహాలు అందించి ఎంతో అభిమానం చూపారని పవన్ పేర్కొన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవహారాలపై విశేషానుభవం ఉన్న రోశయ్య 15సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించడం ఆయన ప్రతిభకు నిదర్శనమన్నారు. ఆ అనుభవం, విధేయత ఆయనను ముఖ్యమంత్రిగా నిలిపిందని పవన్ పేర్కన్నారు. రోశయ్య వాక్పటిమ, చాతుర్యం ఆయనను ఒక విలక్షణ రాజకీయవేత్తగా నిలిపాయన్నారు. నీతి నిజాయతీలతో రాజకీయ ప్రస్థానాన్ని ముగించిన రోశయ్య నేటి పాలకులకు నిస్సందేహంగా ఆదర్శప్రాయులన్నారు. రోశయ్య మృతికి నా తరపున, జనసేన తరపున పవన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ దు:ఖ సమయంలో వారికి భగవంతుడు అండగా నిలవాలని పవన్ కోరారు.