- హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్ర గాయాలు
- వారం పాటు మృత్యువుతో యుద్ధం
తమిళనాడులోని కూనూర్‌లో వారం క్రితం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూశారు. బుధవారం ఉదయం ఆయన చనిపోయినట్టు భారత వైమానిక దళం తెలిపింది. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించింది. ఈ నెల 8న జరిగిన ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధూలిక, 11 మంది సైనికులు చనిపోయారు. వరుణ్ సింగ్ తీవ్రగాయాలతో బెంగళూరులోని మిలిటరీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌కు చెందిన వరుణ్ సింగ్ వయసు 39 ఏండ్లు. ఆయనకు 11 ఏండ్ల కుమారుడు, ఎనిమిదేండ్ల కూతురు ఉన్నారు. ఎయిర్‌ఫోర్స్‌లో వరుణ్ సేవలకు గాను ఆగస్టులో ఆయనను కేంద్రప్రభుత్వం శౌర్య చక్ర అవార్డుతో గౌరవించింది. వరుణ్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం తెలిపారు. ఆయన సేవలను దేశం ఎప్పటికీ మరువబోదని మోదీ పేర్కొన్నారు. వరుణ్ ‘నిజమైన యోధుడు’ అని రాజ్‌నాథ్ అన్నారు.
అసమాన ధైర్య సాహసాలు..
భారత వాయుసేనలో వరుణ్ సింగ్ విశేష సేవలు అందించారు. పైలట్‌గా అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించారు. గతేడాది అక్టోబర్ 12న తాను నడుపుతున్న తేజాస్ యుద్ధ విమానంలో తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తింది. విమానం పూర్తిగా వరుణ్ సింగ్ నియంత్రణ నుంచి తప్పిపోయింది. వేగంగా కిందికి పడిపోవడం ప్రారంభమైంది. ఈ సందర్భంలో వరుణ్ సింగ్ ధైర్యంగా, చాకచక్యంతో వ్యవహరించారు. విమానాన్ని అతి కష్టం మీద నియంత్రణలోకి తెచ్చుకొని ల్యాండింగ్ చేశారు. వరుణ్ నైపుణ్యంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి గాను కేంద్రం ఆయనను శౌర్య చక్రతో సత్కరించింది.