తమ ప్రార్థనాలయాల్లోనే ఎవరికి వారు నిర్వహించుకోవాలి..సీఎం మనోహర్ లాల్
ఏ మతానికి చెందిన వారైనా బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు నిర్వహించడం కుదరదని హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. గురుగ్రామ్ లో ముస్లింలు బహిరంగ ప్రదేశాల్లో శుక్రవారం ప్రార్థనలు నిర్వహించుకోవడం పట్ల పలు హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఖట్టర్ శాసనసభలో ప్రకటన చేశారు. ‘‘అన్ని మత విశ్వాసాలకు చెందిన వారు తమకు చెందిన పవిత్ర ప్రదేశాలైన ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిల్లోనే ప్రార్థనలు చేసుకోవాలి. అన్ని పెద్ద పండుగలు, కార్యక్రమాలను బహిరంగ ప్రదేశాల్లో చేపట్టేందుకు అనుమతి ఉంటుంది. కానీ, తమ బలప్రదర్శన చేయడం ద్వారా ఇతర మతాలకు చెందిన వారి మనోభావాలను గాయపరచడం ఆమోదనీయం కాదు’’ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆఫ్తాద్ అహ్మద్ ఈ అంశాన్ని సభలో లేవనెత్తారు. ‘‘కొన్ని శక్తులు శుక్రవారం ప్రార్థనలను అదే పనిగా అడ్డుకుంటున్నాయి. తమ మత విశ్వాసాలను పాటించే హక్కు రాజ్యాంగం అందరికీ కల్పించింది. గురుగ్రామ్ పట్టణంలో వేలాది కోట్లతో అభివృద్ది కార్యక్రమాలు నడుస్తున్నాయి. కానీ, ఒకరి ఇష్టానుసారం ప్రార్థనలు చేసుకునే స్వేచ్ఛ లేకుంటే గురుగ్రామ్ గురించి ఎటువంటి సందేశం వెళుతుంది?’’ అని ప్రశ్నించారు. దీనికి ముఖ్యమంత్రి ఖట్టర్ బదులిస్తూ… ‘‘బహిరంగ ప్రదేశాల్లో అలా చేయడానికి లేదు. కావాలంటే తమ ప్రార్థనాలయాల్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. శాంతియుత వాతావరణాన్ని కొనసాగించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. సమాజంలో ఎటువంటి ఘర్షణలకు చోటు ఉండకూడదు’’ అని స్పష్టం చేశారు.