సినిమా టికెట్ ధరలు తగ్గించడం పట్ల ఇప్పటికే వైసీపీ సర్కార్ ఫై ఆగ్రహంగా ఉన్న చిత్రసీమ..తాజాగా వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ కు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ సినిమావాళ్లు బలిసి కొట్టుకుంటున్నారని కామెంట్స్ చేయడం పట్ల ఇప్పటికే నిర్మాతల మండలి లేఖ విడుదల చేయగా..తాజాగా నటుడు , దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్ సోషల్ మీడియా వేదికగా ప్రసన్న కుమార్ కు ప్రశ్నల వర్షం కురిపించారు.
- “కరోనా” వల్ల..భయంతో ప్రేక్షకులు థియేటర్ కి రాక, ఇంకో పక్కన.. మీరు టికెట్ రేట్స్ తగ్గించడం, ఆ పైన.. థియేటర్ లో సగం టికెట్స్ అమ్మాలనడం మూలంగా ఎగ్జిబిటర్లు బలిసి కాదు.. అలిసి.. సొలసి థియేటర్ లు మూసేస్తున్నారు అని కాశీ విశ్వనాధ్ పేర్కొన్నారు. . ముఖ్యంగా.. నిర్మాతలు, పెట్టుబడులు పెట్టి వడ్డీలు కడుతూ సినిమాలు బిజినెస్ అవ్వక, పని చేసిన ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్ కి రెమ్యూనరేషన్ ఇస్తూ రిలీజ్ కి సరైన థియేటర్స్ దొరక్క అనేక ఇబ్బందులు పడుతుంటే “సినిమా హాళ్ళు” వున్న మీరు ”సినిమా వాళ్ళు” బలిసి కొట్టుకుంటున్నారు” అనే మాట బుద్ధి లేకుండా ఎలా అనబుద్ది అయింది సార్ ? .
- మా తెలుగు దర్శకుల సంఘంలో.. 2000 మంది సభ్యులుంటే వారిలో 500 మందికే పని ఉంటుంది. మిగతా వాళ్ళు పని లేక, ఆదాయం లేక, ఆకలితో అప్పులు చేసుకుని బతుకుతుంటే ఎలా బలిసి కొట్టుకుంటారు సార్..? .
- టెక్నీషియన్స్ సినిమాల్లో పని లేక ఫంక్షన్స్ లోను, పెళ్ళిళ్ళ లోని, మేకప్ లు వేసుకుంటూ, ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ డెకరేషన్స్ చేసుకుంటూ బతుకుతున్నారు. వీళ్ళు ఎలా బలిసి కొట్టుకుంటారు సార్..?
- “మా” అసోసియేషన్ లో.. దాదాపు 1000 మంది.. ఆర్టిస్టులు, ఆర్టిస్ట్ అసోసియేషన్స్ లో.. 600 మంది నటులుంటే, పర బాషా నటులతో, ప్రవేశంతో డబ్బులు తీసుకోరని పెట్టుకునే సినిమా ఇంట్రెస్ట్ ఉన్న కొత్త వాళ్ళ తాకిడితో ఆర్టిస్టులు వేషాలు లేక అతలాకుతలం అవుతుంటే ఎలా బలిసి కొట్టుకుంటారు సార్..?
- రెక్కాడితే గాని డొక్కాడని మా ఫెడరేషన్ కార్మికులు, జూనియర్ ఆర్టిస్టులు, రోజూ వారీ వేతనాలు పెరగక వచ్చిన డబ్బులతో, ఎండనకా వాననకా, రెక్కలు ముక్కలు చేసుకుని, ఏ పూటకాపూట కడుపు నింపుకుంటుంటే ఎలా బలిసి కొట్టుకుంటారు సార్?
- అంతెందుకూ మా వాళ్ళు ఎప్పుడైనా మీ రాజకీయ నాయకుల్ని “బలిసి కొట్టుకుటటున్నారు” అని అన్నారా? చెప్పండి ! ఒక కులాన్ని కామెంట్ చేస్తే ఆ కులం వాళ్ళందరూ గుంపుగా వచ్చి మీద పడిపోతారు. అలాంటిది మా సినిమా కులం వారిని మీరు ఇష్టమొచ్చినట్టు అవమానిస్తే మాకు బాధ కలగదా సార్..అంటూ వరుస ప్రశ్నలు చిందించారు.