విజయనగరం: సహారా ఇండియా బాధితులకు, ఏజెంట్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ …. సహారా ఇండియా బాధితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్ అండ్ బి జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిధి విజయలక్ష్మి గజపతిరాజు కి వినతి పత్రం అందజేశారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి పోరాట కమిటీ నాయకులు బి.రమణ, ఎస్ వెంకటరమణ లు మాట్లాడుతూ … విజయనగరం ప్రాంతంలో సహార ఇండియా సంస్థలో సుమారు 20 వేల మంది వరకు 400 కోట్ల రూపాయలు రోజువారి నెలవారి సంవత్సరం వారి ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో దాచుకున్నారని తెలిపారు. సహార ఇండియా సంస్థ గత 12 సంవత్సరములగా దాచుకున్న డబ్బులు ఇవ్వకుండా బాండ్లను కాలం పొడిగిస్తూ మారుస్తున్నారని చెప్పారు. డబ్బులు 12 ఏళ్లుగా సహారా బాధితులకు పే మెంట్లు చేయకుండా మోసం చేస్తూ వస్తున్నారన్నారు. అడిగితే సహారా అండ్ సెబి వివాదము వలన సుప్రీం కోర్టులో కేసు ఉన్నదని అందువలన బాండ్లు మారుస్తున్నాం అని చెబుతూ వస్తున్నారన్నారు.
ఈ సంస్థలో పేదవారు మధ్యతరగతి వారు పిల్లల చదువుల కోసం పిల్లల పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బును ఇవ్వకుండా కాలయాపన చేస్తూ వచ్చారన్నారు. భారతదేశంలో 13 కోట్ల మంది ఖాతాదారులకు సుమారు మూడు లక్షల కోట్ల రూపాయల వడ్డీతో సహా చెల్లించవలసివుందన్నారు. చాలాచోట్ల సహారా ఖాతాదారులు ఏజెంట్లు కలిసి ధర్నాలు చేసి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దఅష్టికి తీసుకెళ్లారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టు సహారా ఖాతాదారులకు తేదీ 29-మార్చి- 2023న 5000 కోట్లు రూపాయిలు ఖాతాదారులకు చెల్లించాలని కోర్టువారు సి ఆర్ సి వారికి ఆదేశాలు ఇచ్చారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కలగచేసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , అమిత్ షా కలిసి తేదీ 18వ తేదీ జూలై 2023న, సి ఆర్ సి ,సహారా ఇండియా రిఫండ్ పోర్టల్ ను విడుదల చేశారని తెలిపారు. ఇందులో అప్లై చేసుకున్న ఖాతాదారులకు 10,000 వేల రూపాయలు చొప్పున 45 రోజులలో ఇవ్వడానికి అవకాశం కల్పించారన్నారు.
కోట్లాదిమంది సహారా రిఫండ్ పోర్టల్లో అప్లై చేసుకున్నారు.. కానీ ప్రతి బాండు ఏదో ఒక నెంబరు తేడా అని, పేరు తేడా అని చెప్పి రిజెక్ట్ చేసేస్తున్నారన్నారు. సదరు సహార ఇండియా సంస్థ ఖాతాదారుల నిజమైన లిస్టును సి.ఆర్.సి. వారికి ఇవ్వకపోవడంతో బాండ్లు రిజక్ట్ అవుతున్నాయని తెలిపారు. సహారా సంస్థ సక్రమమైన ఖాతాదారుల లిస్టు ఇవ్వకుండా, ఖాతాదారులను, కేంద్ర ప్రభుత్వాన్ని, సి.ఆర్.సి. వారిని, సుప్రీం కోర్టు వారిని, మోసం చేస్తూ వస్తుందని నేతలు ఆరోపించారు. తమ వద్ద ఉన్న ప్రతి బాండు సహారా ఇండియా సంస్థ ఇచ్చిన బాండ్ మాత్రమే, సహారా సంస్థ ఇచ్చిన ప్రతీ బాండ్ పై ఎవరు ఏ రకమైన దిద్దుబాట్లు చేయటానికి వీలు కాదు అలాంటప్పుడు తమ బాండ్లు రిజెక్ట్ అవ్వడానికి పూర్తిగా సహార ఇండియా సంస్థ తప్పిదం మాత్రమేనన్నారు. ఇప్పటికే చాలామంది ఖాతాదారులు మరణించి ఉన్నారనీ, వారు ఏ విధముంగా డబ్బులు తీసుకునే మార్గం తెలియక, ఈ విషయం అడగడానికి ఆఫీసుకు వెళితే ఆఫీసులన్నీ మూసి ఉన్నాయని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు ఖాతాదారులపై దయ తలచి ఈ విషయము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్దకు తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే అతిధి గజపతిరాజుని కోరామన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఎస్ ఏం నాయుడు, కె వాసుదేవరావు, కె మోహనరావు, పి.సాయి కృష్ణ, కె ఏ ప్రసాద్, కంది త్రినాధ్, బాధితులు, ఏజెంట్లు పాల్గొన్నారు.