తెలంగాణ ముఖ్యాంశాలు

రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపులో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం

చనిపోయిన రైతుల కుటుంబాలు రోజూ ఇబ్బంది పడాలా?..హైకోర్టు

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం అంశంపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. సిద్దిపేట సామాజిక కార్యకర్త కొండల్‌రెడ్డి వేసిన పిల్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం… రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపులో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 6న రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. రూ.6 లక్షలు చెల్లించేలా 2015లో ప్రభుత్వం జీవో ఇచ్చిందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.

జీవో జారీ చేసి ఆరేళ్లు దాటినా పరిహారం చెల్లించలేదని వెల్లడించారు. పలు జిల్లాల్లో రైతు కుటుంబాలకు పరిహారం అందాల్సి ఉందని కోర్టుకు తెలియజేశారు.ఈ విషయంపై గడువు కావాలన్న ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థనపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. జీవోలు జారీ చేసి తర్వాత ప్రక్రియ వదిలేశారని హైకోర్టు వ్యాఖ్యానించింది. చనిపోయిన రైతుల కుటుంబాలు రోజూ ఇబ్బంది పడాలా అని ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 6కు వాయిదా వేసింది.