రష్యాకు తీవ్ర నష్టాలు వాటిల్లే అవకాశం
ఉక్రెయిన్… రష్యాతో పోల్చితే అన్ని విధాలా దిగదుడుపే. సైనికపరంగా రష్యా కంటే ఎంతో వెనుకబడి ఉంది. కానీ యుద్ధంలో రష్యా సేనలకు ఉక్రెయిన్ కొరకరానికొయ్యలా మారిందంటే అందుకు కారణం… కొన్ని ప్రత్యేకమైన ఆయుధాలే. వాటిలో జావెలిన్, స్టింగర్ క్షిపణులకు తోడు టర్కీ తయారీ బైరక్తర్ డ్రోన్లు కూడా ఉన్నాయి. వీటిసాయంతోనే ఉక్రెయిన్ దళాలు రష్యన్ బలగాలను చావుదెబ్బ కొడుతున్నాయి.
తాజాగా, మరిన్ని ఆయుధాలు కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ కోరుతున్న నేపథ్యంలో, అమెరికా అధునాతన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ల సరఫరాకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే పలు వ్యూహాత్మక ఆయుధాలు వినియోగిస్తున్న ఉక్రెయిన్ కు రీపర్ డ్రోన్లు కూడా సమకూరితే రష్యా బలగాల కష్టాలు రెట్టింపు కానున్నాయి. వీటినే ప్రిడేటర్-బి డ్రోన్లుగానూ పిలుస్తారు.
ఇటీవలే ఉక్రెయిన్ అధికారులు అమెరికాలో పర్యటించి కాలిఫోర్నియాలోని జనరల్ అటామిక్స్ కేంద్రాన్ని సందర్శించి సైనిక డ్రోన్లను పరిశీలించారు. దీనిపై అమెరికా జనరల్ అటామిక్స్ ప్రతినిధి మార్క్స్ బ్రెంక్లి స్పందిస్తూ, ప్రభుత్వం అనుమతిస్తే స్వల్ప వ్యవధిలోనే ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లను ఉక్రెయిన్ కు అందించగలమని ధీమా వ్యక్తం చేశారు. కొన్ని డ్రోన్లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని, వాటిని వెంటనే సరఫరా చేయగలమని చెప్పారు.
కాగా, ఎంక్యూ9 రీపర్ డ్రోన్ల పరిధి 1,850 కిలోమీటర్లు. ఇవి గరిష్ఠంగా గంటకు 482 కిలోమీటర్ల వేగంతో పయనిస్తాయి. సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దుల్లో పలు ఆపరేషన్లలో వీటిని అమెరికా విజయవంతంగా ఉపయోగించింది. ఐసిస్, అల్ ఖైదా ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక కమాండర్లను హతమార్చడంలో ఈ డ్రోన్లు కీలకపాత్ర పోషించాయి. వీటి నుంచి హెల్ ఫైర్ క్షిపణులు, ఎయిర్ టు ఎయిర్ స్టింగర్ మిస్సైళ్లు, బ్రిమ్ స్టోన్ క్షిపణులు ప్రయోగించే వీలుంది. ఒక రకంగా ఇది మానవరహిత యుద్ధ విమానం అని భావించవచ్చు.