బ్యాక్ డోర్ ద్వారా యత్నించే వారు ఆశలు వదులుకోవాల్సిందే..రాహుల్
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే పర్యటనలో భాగంగా శనివారం మధ్యాహ్నం టీపీసీసీ కార్యాలయం గాంధీ భవన్‌లో పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. పనిచేసిన వారికే పార్టీ టికెట్లు దక్కుతాయన్నరాహుల్… పనిచేయని వారిని పక్కనపెట్టేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై రాహుల్ విస్పష్టంగా మాట్లాడారు. మెరిట్ ఆధారంగానే పార్టీ టికెట్లను కేటాయిస్తామన్న రాహుల్ గాంధీ.. ప్రజలు, రైతుల పక్షాన పోరాటం సాగించిన వారికే టికెట్లు ఇస్తామన్నారు. ఈ విషయంలో సీనియర్లు, జూనియర్లు అన్న తేడాను చూడబోమని కూడా ఆయన చెప్పారు.
పార్టీ కోసం పనిచేయని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్లు దక్కవని రాహుల్ చెప్పారు. హైదరాబాద్‌లో కూర్చుంటే, ఢిల్లీ చుట్టూ తిరిగితే టికెట్లు రావని కూడా రాహుల్ తెలిపారు. బ్యాక్ డోర్ ద్వారా టికెట్లు ఆశించే వారు టికెట్ల విషయంలో ఆశలు వదులుకోవాల్సిందేనని చెప్పారు. ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే హైదరాబాద్‌ను వదిలి నేతలు గ్రామాల బాట పట్టాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. టికెట్ల కేటాయింపులో వ్యక్తిగతంగా సర్వే చేసిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటామన్నారు. వరంగల్ డిక్లరేషన్‌ను రైతుల్లోకి తీసుకెళ్లాలని రాహుల్ సూచించారు. వరంగల్‌లో విడుదల చేసింది డిక్లరేషన్ మాత్రమే కాదన్న రాహుల్.. అది ప్రజలు, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న ఒప్పందం అని పేర్కొన్నారు.