కరోనా వైరస్ మహమ్మారితో ఇండియా విలవిలలాడినట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. అయినా ఆ దేశం అద్భుత రీతిలో కోలుకుంటోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తి చెందడానికి చైనానే కారణమని, ఆ దేశం అమెరికాకు పది ట్రిలియన్ల డాలర్లు చెల్లించాలంటూ పేర్కొన్నారు. గురువారం ఆయన ఫాక్స్ న్యూస్ ఇంట్వర్వ్యూలో మాట్లాడారు. పది ట్రిలియన్ల డాలర్లు కాదు.. నిజానికి చైనా ఇంకా ఎక్కువే చెల్లించాలన్నారు.
ల్యాబ్ లీక్ ప్రమాదమే..
వుహాన్ ల్యాబ్ నుంచి ప్రమాదవశాత్తు కరోనా వైరస్ బయటకు వచ్చి ఉంటుందని ట్రంప్ అన్నారు. చైనా అసమర్థత వల్లే వుహాన్ ల్యాబ్‌లో ఆ ప్రమాదం జరిగి ఉంటుందని ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఆ ప్రమాదం గురించి చాలా తెలుసుకోవాలని, ఎలా జరిగింది, ఎందుకు జరిగిందన్న కోణంలో విచారణ జరగాలన్నారు. అలాంటి వైరస్ ప్రయోగాల సమయంలో ఎలా అసమర్ధంగా ఉంటారని ట్రంప్ ప్రశ్నించారు. నిజానికి మనకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయని, కానీ మరీ యువకులకు వ్యాక్సిన్లు ఇవ్వాలన్న టెన్షన్ వద్దు అని, ఆ ప్రక్రియను ఆపాలన్నారు. ఎందుకంటే దేశాన్ని ఆర్థికంగా నడపాల్సిన సమయం ఇది అన్నారు.
పిల్లలకు వద్దు..
మనం వ్యాక్సిన్లను తయారు చేయడం గొప్ప విషయమని, కానీ స్కూల్ పిల్లలకు పెద్దగా వైరస్ ప్రభావం ఉండదని, 99.99 శాతం పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అనవసరంగా దీని గురించి ఆలోచించవద్దు అని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే చర్యలు తీసుకోవాలన్నారు.