జాతీయం ముఖ్యాంశాలు

రాష్ట్రప‌తి ఎన్నికల షెడ్యూల్‌ను విడుద‌ల చేసిన సీఈసీ

జూలై 18న రాష్ట్రప‌తి ఎన్నిక‌ల పోలింగ్
ఈ నెల 15 రాష్ట్రప‌తి ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్‌
ఈ నెల 29 వ‌ర‌కు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌
జూలై 2 వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు

భార‌త రాష్ట్రప‌తి ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైంది. ఢిల్లీలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్ ఈ షెడ్యూల్‌ను విడుద‌ల చేశారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్‌ను ఈ నెల 15న జారీ చేయ‌నున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. జూన్ 15 నుంచి నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఆయ‌న చెప్పారు. ఈ నెల 29 వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రిస్తామ‌ని, 30న నామినేష‌న్ల ప‌రిశీలన ఉంటుంద‌ని రాజీవ్ కుమార్ ప్ర‌కటించారు. జూలై 2 వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు.

ఎలక్టోరల్ పద్ధతిలో రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల విలువ 10, 98, 903 కాగా 2, 34, 680 ఓట్లు పొందిన అభ్యర్ధి రాష్ట్రపతిగా ఎన్నికౌతారు. ఎలక్టోరల్ కాలేజీలో 778 మంది ఎంపీలు, 4120 ఎమ్మెల్యేలుంటారు. ఒక్కో ఎంపీ విలువ 700. ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలం జులై 24న ముగియనుంది. దీంతో కొత్త రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ వచ్చే నెల 24లోపే పూర్తి కావాల్సి ఉంటుందని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో కీల‌కమైన పోలింగ్‌ను జూలై 18 నిర్వ‌హించ‌నున్న‌ట్లు రాజీవ్ కుమార్ ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత జూలై 21న ఓట్ల లెక్కింపును నిర్వ‌హిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌స్తుత రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ పద‌వీ కాలం జూలై 24తో ముగియ‌నుంద‌ని, ఈ నేపథ్యంలో జూలై 25లోగా నూత‌న రాష్ట్రప‌తి ఎన్నిక పూర్తి కావాల్సి ఉంద‌ని తెలిపిన రాజీవ్ కుమార్‌.. అందుక‌నుగుణంగానే షెడ్యూల్‌ను ఖ‌రారు చేశామ‌ని తెలిపారు. నామినేషన్ల ప‌ర్వం, ఓట్ల లెక్కింపు ఢిల్లీలోనే జ‌ర‌గ‌నుండ‌గా…పోలింగ్ మాత్రం పార్ల‌మెంటు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీల ఆవ‌ర‌ణ‌లో జ‌ర‌గ‌నున్న‌ట్లు రాజీవ్ కుమార్ ప్ర‌క‌టించారు.