తెలంగాణ బీజేపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బండికి పార్టీ జాతీయ కార్యవర్గంలో స్థానం కల్పించారు. పార్టీలో కొనసాగుతున్న ప్రతిష్ఠంభన వేళ ప్రధాని పర్యటన పూర్తయిన వెంటనే ఈ నిర్ణయం వెలువడింది. దీంతో కేంద్ర మంత్రిగా బండికి ఛాన్స్ లేనట్లేనా. మరి తెలంగాణ నుంచి ఇప్పుడు కొత్తగా కాబోయే కేంద్ర మంత్రి ఎవరు అనేది ఆసక్తిగా మారింది.
బండికి పార్టీ పదవితో: ఎన్నికల వరకు బండి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారని ముఖ్య నేతలు చెబుతూ వచ్చారు. కానీ, బండి మార్చారు. కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. బండి పైన పార్టీలోని ఆయన వ్యతిరేకులు చేసిన ఫిర్యాదుల ఫలితమే ఈ మార్పు అనే చర్చ సాగుతోంది. దూకుడుగా ఉండే బండిని కాదని..సౌమ్యుడిగా ఉండే కిషన్ రెడ్డి ఎన్నికల వేళ పార్టీ పగ్గాలు సరి కాదనే విశ్లేషణలు ఉన్నాయి.
ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కేడర్ కు అంతు చిక్కటం లేదు. పార్టీలో క్రియాశీలకంగా మారిన బండికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని ప్రచారం సాగింది. ప్రాధాన్యత కొనసాగిస్తారని నేతలు చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు బండిని బీజేపీ జాతీయ కార్యవర్గంలో నియమిస్తూ తాజాగా నిర్ణయం వెలువడింది.