weight
అంతర్జాతీయం ముఖ్యాంశాలు

‘వెయిట్ లాస్’ ఇంజెక్షన్ల వల్ల ఇలా జరుగుతుందా?

బరువు తగ్గడానికి తీసుకునే కొన్ని ఇంజెక్షన్ల వల్ల ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు, స్వీయహాని ఆలోచనలు కలిగే ప్రమాదం ఉందన్న హెచ్చరికల మేరకు అలాంటి మందులను సమీక్షిస్తున్నట్లు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ(ఈఎంఏ) బీబీసీతో చెప్పింది.

ఈఎంఏ సభ్య దేశం ఐస్‌లాండ్ ఇలాంటి మూడు కేసులను గుర్తించిన తరువాత ఏజెన్సీకి సమాచారం అందించింది.

వెగోవీ, సాక్సెండా, ఓజెంపిక్ వంటి ఆకలిని మందగింపజేసే మందుల సేఫ్టీ అసెస్‌మెంట్ చేయనున్నట్లు ఈఎంఏ చెప్పింది.

ఇలాంటి మందులను విక్రయించే సంస్థలు తమ ఔషధాలతో పాటు ఇచ్చే కరపత్రాలలో ప్రస్తావించిన ‘పాజిబుల్ సైడ్ ఎఫెక్ట్స్‌’లో ఆత్మహత్య ఆలోచనలను కూడా చేర్చాయి.

ఈ సమీక్ష చేపడుతున్న యూరోపియన్ మెడికల్ ఏజెన్సీకి చెందిన ‘ఫార్మా కోవిజిలెన్స్ రిస్క్ అసెస్‌మెంట్ కమిటీ’(పీఆర్ఏసీ) ఇలాంటి కేటగిరీకి చెందిన ఇతర చికిత్సలు, ‘గ్గూకగాన్ లైక్ పెప్టైడ్-1’ (జీఎల్‌పీ-1) రిసెప్టర్ అగోనిస్ట్స్‌ను కూడా సమీక్షించాల్సిన అవసరం ఉందా అనేది పరిశీలించనుంది.

తొలుత ఈ ఏజెన్సీ సెమాగ్లుటైడ్ కానీ లిరాగ్లుటైడ్ కానీ ఉండే వెయిట్ లాస్ మందుల వల్ల కలిగే నష్టాలను అంచనా వేయనుంది.

మూడు కేసులు నమోదైన తరువాత ఐస్‌లాండ్ మెడికల్ ఏజెన్సీ లేవనెత్తిన సిగ్నల్ ప్రొసీజర్ నేపథ్యంలో ఈ సమీక్ష చేపడుతున్నామని ఈఎంఏకు చెందిన అధికారి ఒకరు చెప్పారు.

‘‘సిగ్నల్ అనేది ఏదైనా ఔషధం వల్ల కలిగే అవకాశం ఉన్న ప్రతికూల పరిణామానికి సంబంధించిన సమాచారం. అది అప్పటికే తెలిసిన ప్రతికూల పరిణామం కావొచ్చు, కొత్తది కావొచ్చు. మరింత లోతుగా పరిశోధించేందుకు ఈ సమాచారం తోడ్పడవచ్చు’’ అన్నారు.

ఆత్మహత్య ఆలోచనలు కలిగిన రెండు కేసులలో ఒకటి సాక్సెండాను ఉపయోగించినది, ఇంకోటి ఓజెంపిక్ వినియోగించినది.

మూడో కేసు స్వీయహానికి సంబంధించినది. ఈ కేసులో బాధిత వ్యక్తి సాక్సెండా ఉపయోగించిన తరువాత ఇలా జరిగింది.

దీనికి సంబంధించిన మరింత సమాచారం అందుబాటులోకి వచ్చిన తరువాత ఈఎంఏ ఆ విషయం వెల్లడిస్తుందని ఆ అధికారి చెప్పారు.

సెలబ్రిటీలు, ఇతర వ్యక్తులు బరువు తగ్గడంపై సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఇలాంటి బరువు తగ్గించే చికిత్సలకు డిమాండ్ పెంచాయి.

వెయిట్ లాస్ చికిత్సల కోసం సాక్సెండా, వెగోవీ మందులకు ఆమోదం, లైసెన్స్లు ఉన్నాయి. బ్రిటన్‌లో వెగోవీ ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ, అవసరమైన రోగులకు జనరల్ ప్రాక్టీషినర్స్(వైద్యులు) ఆ మందును త్వరలో ఇస్తారని, వెయిట్ మేనేజ్‌మెంట్ క్లినిక్‌లలోనూ ఇస్తారని ప్రధాని ఇటీవల చెప్పారు.

ఓజెంపిక్‌ను మధుమేహ రోగుల్లో చక్కెర స్థాయి, బరువును నియంత్రించడానికి ఉఫయోగిస్తారు. అయితే, ఇందులో వెగోయిలో ఉన్నట్లే సెమాగ్లుటైడ్ తక్కువ మోతాదులో ఉంటుంది.

అయితే, మధుమేహం లేనివారు కూడా కొందరు బరువు తగ్గడం కోసం ఈ ఇంజెక్షన్ వాడుతుండడంతో కొరత ఏర్పడుతోంది.

అన్ని మందులకూ ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది. బరువు తగ్గాలంటే ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు ఎక్సర్‌సైజ్ అవసరం.

బరువు తగ్గిస్తాయని చెప్పే మందులతో కలిగే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఇవీ..

వికారం

వాంతులు

తలనొప్పి

మలబద్దకం

కడుపునొప్పి

అలసిపోవడం

ఓజెంపిక్ ఔషధంతో పాటు ఇచ్చే కరపత్రంలో కుంగుబాటు, ఆత్మహత్య ఆలోచనలు వంటివి కలగొచ్చని రాశారు.

‘‘మానసికంగా కలిగే ఎలాంటి మార్పులనైనా జాగ్రత్తగా గమనించాలి. మూడ్‌, ప్రవర్తన, ఆలోచనలు, ఫీలింగ్స్‌లో ఒక్కసారిగా మార్పులు రావడం వంటివి గుర్తిస్తే వైద్యులను సంప్రదించాలి’’ అని ఆ కరపత్రంలో రాశారు.

ఈ మందును రాసే వైద్యులు కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయేమోనని పర్యవేక్షించాలని అందులో సూచించారు.

యూరోపియన్ మెడికల్ ఏజెన్సీతో ఔషధ తయారీ సంస్థ నోవోనార్డిక్స్ సంప్రదింపులు జరుపుతోంది. రోగుల భద్రతకే అధిక ప్రాధాన్యమిస్తామని ఆ సంస్థ చెప్తోంది.

ఆ సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ- ‘టైప్-2 డయాబెటిస్ చికిత్సలో జీఎల్‌పీ-1 రిసెప్టర్ అగోనిస్ట్స్ గత 15 ఏళ్లుగా వాడుతున్నారు. స్థూలకాయ చికిత్సలలో దీన్ని ఎనిమిదేళ్లుగా ఉపయోగిస్తున్నారు. నోవోనార్డిక్స్ ఉత్పత్తులైన సెమాగ్లుటైడ్ 2018 నుంచి, లిరాగ్లుటైడ్‌ 2009 నుంచి బ్రిటన్ మార్కెట్‌లో ఉన్నాయి’’ అని చెప్పారు.

క్లినికల్ ట్రయల్స్ డాటా కానీ, మార్కెట్‌లో ప్రవేశపెట్టిన తరువాత సేకరించిన డాటా కానీ ఈ మందులకు ఆత్మహత్య ఆలోచనలకు ఉన్న సంబంధాన్ని సూచించలేదని ఆ ప్రతినిధి చెప్పారు.

రోగుల భద్రతకు పూచీ కల్పించడానికి నోవోనార్డిక్స్ కట్టుబడి ఉందని ఆ ప్రతినిధి చెప్పారు.

పరిస్థితులను తాము సమీక్షిస్తున్నామని బ్రిటన్‌లోని ఔషధ నియంత్రణ సంస్థ ‘ది మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ’(ఎంహెచ్ఆర్ఏ) తెలిపింది.

ఎంహెచ్ఆర్ఏ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ డాక్టర్ అలిసన్ కేవ్ మాట్లాడుతూ- ‘‘ఏవైనా ఔషధాల వల్ల అనుమానాస్పద ప్రతిచర్యలు కలుగుతున్నట్లు మా నిశిత పరిశీలనలో గుర్తిస్తే వైద్యులను అప్రమత్తం చేస్తాం. అవసరమనిపిస్తే రోగులకూ సూచనలు జారీ చేస్తాం’’ అన్నారు.