పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అర్బన్ తెలుగుదేశం ప్రభుత్వంలో టిడ్కో గృహాల పేరుతో వేల కోట్లు దోచేశారని, వందల కోట్లు మనీ లాండరింగ్ చేశారని ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. స్థానిక ఏపీ టిడ్కో గృహ సముదాయాల వద్ద మున్సిపల్ కమిషనర్ అనపర్తి శామ్యూల్ అధ్యక్షతన లబ్ధిదారులకు రుణమేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు మాట్లాడుతూ టిడ్కో నిర్మాణాల్లో చదరపు అడుగుకు 1,250 ఖర్చయ్యే దానికి 2,100కు ఒప్పందం కుదుర్చుకుని ఎల్‌అండ్‌టీ కంపెనీ నిర్మాణాలు చేపట్టిందన్నారు.
ప్రస్తుతం అ డుగుకు రూ.40 మాత్రమే కంపెనీకి చెల్లించాల్సి ఉండగా నిర్మాణాలు నిలిపివేయడం దారుణమన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబుతో చేతులు కలిపి లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. పట్టణంలో 5,376 గృహాలకు గాను 2,272 మంది లబ్ధిదారులకు ఫ్లాట్లు అందించామన్నారు. 3,104 యూనిట్లను అందించాల్సి ఉండగా వారిలో 1,285 మందికి వయసు మీరడంతో బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయన్నారు. ఈ సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లగా బ్యాంకుల నుంచి రుణాలు ఇచ్చేలా రుణమేళా ఏర్పాటు చేశారన్నారు.
దీంతో బ్యాంకు లింకేజీకి బ్యాంకు అధికారులు ముందుకు వచ్చారన్నారు. టిడ్కో నిర్మాణాల్లో అవసరం లేకపోయినా చంద్రబాబు షేర్‌వాల్ టెక్నాలజీని తీసుకువచ్చి వేల కోట్లు దోచేశాడని దుయ్యబట్టారు. వైఎస్సార్ హయాంలో 59 ఎకరాల విమానాశ్రయ భూములకు పేదల కోసం రూ.5.50 కోట్లతో మెరక చేయించామని, వీటిపై కూడా కన్నేసి చంద్రబాబు వందల కోట్లు కొట్టేశాడని ధ్వజమెత్తారు.