సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం వైకాపా, బీజేడీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు-2023 కు ఎందుకు మద్దతిస్తున్నారని నిలదీశారు. ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు బదులుగా తీసుకొస్తున్న ఈ బిల్లుకు బీజేపీ ఎంపీలు మద్దతిచ్చారంటే అర్థం చేసుకోవచ్చునని, వైసీపీ, బీజేడీ ఎందుకు మద్దతిస్తున్నాయో తెలియడం లేదని వ్యాఖ్యానించారు.ఎక్స్ (ట్విటర్) వేదికగా చిదంబరం వైసీపీ, బీజేడీలను తీవ్రంగా దుయ్యబట్టారు. ‘‘ఢిల్లీ సర్వీసుల అథారిటీ బిల్లుకు బీజేపీ ఎంపీలు మద్దతిస్తున్నారంటే అర్థం చేసుకోగలం. కానీ బీజేడీ, వైసీపీ ఈ బిల్లుకు ఎందుకు మద్దతిస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు’’ అని తెలిపారు.
ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వం నియమించే ఇద్దరు అధికారులతో కూడిన త్రిసభ్య అథారిటీలో యోగ్యత ఉందని ఈ రెండు పార్టీలు గుర్తించాయా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇద్దరు అధికారులు కోరం అవుతారని, వారిద్దరూ సమావేశాన్ని నిర్వహించి, ముఖ్యమంత్రి భాగస్వామ్యం లేకుండా నిర్ణయం తీసుకోవచ్చునని చెప్తున్న నిబంధన సరైనదేనని ఈ పార్టీలు గుర్తించాయా? ఈ ఇద్దరు అధికారులు ముఖ్యమంత్రిపై పైచేయిగా వ్యవహరించవచ్చుననే నిబంధనలో పస ఉందని భావిస్తున్నాయా? అథారిటీ ఏకగ్రీవ నిర్ణయాన్ని సైతం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తోసిపుచ్చవచ్చుననే నిబంధన సరైనదని భావిస్తున్నాయా? అని నిలదీశారు.
ఢిల్లీ రాష్ట్ర మంత్రుల ప్రమేయం లేకుండా, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంలో పని చేసే అధికారుల అధికారాలు, విధులను నిర్వచించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్తున్న నిబంధన సరైనదని భావిస్తున్నాయా? ఈ బిల్లు ఆమోదం పొందితే, అధికారులే యజమానులవుతారని, మంత్రులు వారికి క్రింది స్థాయివారిగా మారుతారని ఈ రెండు పార్టీలు అర్థం చేసుకున్నాయా? అని ప్రశ్నించారు.