ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

పనులు ఆపకుంటే జైలుకే!

  • సీమ ఎత్తిపోతల కొనసాగింపుపై
  • ఏపీ సీఎస్‌కు ఎన్జీటీ హెచ్చరిక
  • అనుమతి లేనిదే ‘రాయలసీమ’ చేపట్టొద్దని చెప్పాం
  • పనులు కొనసాగినట్టు తేలితే ఊచలు లెక్కపెట్టాల్సిందే
  • ఆంధ్రప్రదేశ్‌ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్జీటీ
  • తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కేఆర్‌ఎంబీకి ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను అక్రమంగా కొనసాగించడంపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తమ ఆదేశాలను ఉల్లంఘించి పనులు జరిపినట్టు తేలితే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)ని జైలుకు పంపుతామని హెచ్చరించింది. తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ని, చెన్నైలోని కేంద్ర పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 12కు వాయిదా వేసింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా రాయలసీమ లిఫ్ట్‌ పనులను ఎట్టిపరిస్థితుల్లోనూ చేపట్టవద్దని చెన్నైలోని ఎన్జీటీ బెంచ్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 24న స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ప్రాజెక్టు పనులు చేస్తున్నదని తెలంగాణ సర్పంచుల సంఘం నేత గవినోళ్ల శ్రీనివాస్‌ కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై జస్టిస్‌ రామకృష్ణన్‌, ఎక్స్‌పర్ట్‌ మెంబర్‌ సత్యగోపాల్‌తో కూడిన బెంచ్‌ శుక్రవారం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం ఎన్జీటీ ఆదేశాలను ధిక్కరిస్తూ పనులను కొనసాగిస్తున్నదని తెలిపారు. కేఆర్‌ఎంబీకి చెందిన నిజనిర్ధారణ కమిటీ నిర్మాణ ప్రాంతంలో తనిఖీలు జరుపాలని ఎన్జీటీ గతంలో ఆదేశించిందని.. ఈ మేరకు కేఆర్‌ఎంబీ కమిటీని నియమించినా ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదని పేర్కొన్నారు. మరోవైపు ఈ పథకానికి పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని ఎన్జీటీ చెప్తుండగా.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి అనుమతులు అవసరం లేదని కేంద్ర పర్యావరణ శాఖకు లేఖలు రాస్తున్నదని వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ రాంచందర్‌రావు వాదనలు వినిపిస్తూ.. ఎన్జీటీ తీర్పు అమలు కావడం లేదని చెప్పారు. ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది మాధురిరెడ్డి వాదనలు వినిపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద ఎలాంటి పనులు చేపట్టడం లేదని చెప్పారు. వాదనలు విన్న అనంతరం బెంచ్‌ స్పందిస్తూ.. రాయలసీమ ఎత్తిపోతల పనుల తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కేఆర్‌ఎంబీ, చెన్నైలోని కేంద్ర పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆదేశించింది. తమ తీర్పును ఉల్లంఘించినట్టు తేలితే ఏపీ సీఎస్‌ను జైలుకు పంపుతామని స్పష్టంచేసింది. తదుపరి విచారణను జూలై 12కు వాయిదా వేసింది.