chiru
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

చిరు ప్రకటనలతో ప్రకంపనలు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు రాజకీయచర్చకు దారితీశాయి. ఇప్పటివరకూ జనసేన పార్టీ గురించి గానీ పవన్ కళ్యాణ్ గురించి గానీ పెద్దగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు చిరంజీవి. ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ ధరల పెంపు సమయంలో కూడా సినీపరిశ్రమ పెద్దగా అమరావతి వచ్చిన చిరంజీవి… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఆ తర్వాత కూడా ఒకసారి సీఎం జగన్ తో భేటీ అయ్యారు మెగాస్టార్. పవన్ విషయంలో జోక్యం చేసుకోకపోవడం,సీఎం జగన్ తో భేటీలతో ఏపీ ప్రభుత్వానికి చిరంజీవి దగ్గరగా ఉన్నారనే చర్చ అప్పట్లో జోరుగా సాగింది. ఒకవైపు పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం పై,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా…అటు పవన్ పై మంత్రులు, వైసీపీ నేతలు మాటల దాడి చేసినా ఏ మాత్రం తనకు పట్టదన్నట్లు వ్యవహరించారు చిరంజీవి.

జనసేన పార్టీతో నాగబాబు మాత్రమే ఉన్నారని…చిరంజీవి రాజకీయంగా దూరంగా ఉన్నారని అందరూ భావించారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేస్తున్న చిరంజీవి…ఒక్కసారిగా ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడటం పెద్ద చర్చగా మారింది. మళ్లీ చిరంజీవి తన తమ్ముడు పవన్ కు దగ్గరయ్యారా? జనసేనకు చిరంజీవి మద్దతు ఉంటుందా అని రాజకీయవర్గాల్లో చర్చ ఊపందుకుంది.చిరు కామెంట్స్ తో మారుతున్న రాజకీయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉన్నట్టుండి చిరంజీవి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేసారనేది సస్పెన్స్ గా మారింది. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అన్నట్లు సినిమా పరిశ్రమపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చిరంజీవి వ్యాఖ్యానించారు. అంతే కాదు ప్రత్యేక హోదా తీసుకురండి, రోడ్లను బాగుచేయండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు చిరంజీవి.

వాల్తేర్ వీరయ్య సినిమా 200 రోజుల వేడుకలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయం మారుతుందని చర్చ జరుగుతోంది. బ్రో సినిమా వివాదంతో పవన్ కళ్యాణ్ రెన్యూమరేషన్ అంశం తెరపైకి వచ్చింది. తనను సినిమాలో కించరిచేలా చూపించారంటూ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. సినిమా ఖర్చులు,హీరో పవన్ కళ్యాణ్ రెన్యూమరేషన్ బయటపెట్టాలని డిమాండ్ చేసారు. పవన్ కు చంద్రబాబు దగ్గర నుంచి వచ్చిన బ్లాక్ మనీని సినిమా రూపంలో వైట్ మనీగా అందజేశారని నిర్మాత పైనా ఆరోపణలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ రోజుకు రెండుకోట్లు పారితోషికం తీసుకుని ఆయన బాగుపడ్డారని… సినిమాను కొన్న ఎగ్జిబిటర్లు మాత్రం నష్టపోయారని అంబటి రాంబాబు ఆరోపించారు. బ్రో సినిమాకు వ్యతిరేకంగా మ్రో అనే సినిమా తీస్తానని చేసిన వ్యాఖ్యలతో అంబటి రాంబాబు – జనసేన మధ్య సినిమా రాజకీయం తీవ్ర స్థాయిలో నడిచింది.

అలా మొదలైన రాజకీయం కాస్తా.. చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసే వరకూ వెళ్ళింది. చిరు చేసిన వ్యాఖ్యలతో ఇకపై జనసేనలో చిరంజీవి కీలక పాత్ర పోషిస్తారని టాక్ కూడా మొదలైంది.చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలతో ఆయన పవన్ కళ్యాణ్ ని సమర్థించారని చర్చ జరుగుతుంది. అందుకే చిరంజీవిపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు.అసలు చర్చ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తోనే స్టార్ట్ అయిందంటూ విమర్శలు గుప్పించారు నేతలు. అంతకు ముందు ఎప్పుడూ సినిమా పరిశ్రమపై రాజకీయ పార్టీల నేతలు ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెబుతున్నారు. బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబు క్యారెక్టర్ ను కావాలనే సృష్టించి రాజకీయం చేసారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు గిల్లితే రెండో వైపు కూడా గిల్లించుకోవలని అంటున్నారు.

అసలు చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పెట్టకుండా అన్యాయం చేశారని గుర్తు చేస్తున్నారు. అప్పడు చిరంజీవి ఎక్కడున్నారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా చిరంజీవి నిలబడటం పై మొదటిసారి చిరంజీవిపై ఏపీ ప్రభుత్వం నుంచి విమర్శలు దాడి స్టార్ట్ అయింది. మరోవైపు చిరంజీవి జనసేన పార్టీలో చేరుతారా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చివరికి ఏం జరుగుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే