ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న రాజకీయ మాటల యుద్ధంలో నారా లోకేష్ పై తీవ్ర ఆరోపణలు చేసిన వ్యవహారంలో మంగళగిరి కోర్టులో పరువు నష్టం కేసు ఎదుర్కొంటున్న ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి.. ఇవాళ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిశారు. నారా లోకేశ్ పై డీజీపీకి ఫిర్యాదు చేశారు. తనకు లోకేశ్ నుంచి ప్రాణహాని ఉందంటూ పోసాని ఫిర్యాదులో పేర్కొన్నారు. రక్షణ కల్పించాలంటూ డీజీపీని కోరగా.. ఆ మేరకు హామీ లభించింది.
గతంలో తన పేరుపై లేని భూములు తాను కొన్నట్లు ఆరోపణలు చేసిన పోసానిపై తాజాగా మంగళగిరి కోర్టులో నారా లోకేష్ క్రిమినల్ పరువునష్టం దావా వేశారు. ఈ కేసులో ఇప్పటికే లోకేష్ కోర్టుకు హాజరై వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో లోకేష్ పై పోసాని మాటల దాడి మొదలుపెట్టారు. లోకేష్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, తన వ్యాఖ్యలకే జైలుకు పంపిస్తారా, తాను నాలుగు కోట్లు కట్టాలా అంటూ పోసాని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ డీజీపీని కలిశారు.
తనను చంపేందుకు నారా లోకేష్ ప్రయత్నిస్తుున్నట్లు సమాచారం ఉందని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి పోసాని ఫిర్యాదు చేశారు. కాబట్టి తనకు భద్రత కల్పించాలని కోరారు. దీనికి డీజీపీ కూడా అంగీకరించినట్లు ఆ తర్వాత బయటికి వచ్చిన పోసాని కృష్ణమురళి తెలిపారు. తనకు ప్రాణహాని వెనుక గల కారణాల్ని కూడా ఆయన డీజీపీకి వివరించారు. టీడీపీ నేత నారా లోకేష్ తో తనకు ఉన్న శత్రుత్వాన్ని కూడా ఆ తర్వాత వెల్లడించారు.
టీడీపీలో లోకేష్ తనను చేర్చుకునేందుకు తన పీఏ లోకేష్ ద్వారా ప్రయత్నించారని, దానికి తాను అంగీకరించకపోవడంతో ఆయన ఇగో హర్ట్ అయిందని పోసాని కృష్ణమురళి ఆరోపించారు. కాపుల ఓట్ల కోసం లోకేష్, చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నట్లు తెలిపారు. గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు తనకు సీఎం వద్దన్న చంద్రబాబు, కాంగ్రెస్ ఓడిపోయాక టీడీపీలో చేరి సీఎం అయ్యారన్నారు. ఆ తర్వాత మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారన్నారు. చంద్రబాబుకు సీఎం పదవి తీసుకోవడం ఇష్టం లేకపోతే పవన్ కళ్యాణ్ కు ఇస్తానని ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.