ysrcp
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

వైసీపీ నేతల ఢిల్లీ బాట.. ఓటర్ల జాబితాలపై ఫిర్యాదుకు రెడీ

ఓటర్ల జాబితాలో అక్రమాలు ఏపీలో కాక రేపుతున్నాయి. ఈ నెల 28న ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేయాలని నిర్ణయించడంతో అదే రోజు ఈసీని కలవాలని వైసీపీ నిర్ణయించింది. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అక్రమాలకు టీడీపీ కారణమంటూ ఫిర్యాదు చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలో అక్రమాలకు తెలుగుదేశం పార్టీ కారణమని ఆరోపిస్తూ వైసీపీ నేతలు ఢిల్లీ బాటపడుతున్నారు. ఈ నెల 28న దిల్లీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలవనున్నట్లు వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి వెల్లడించారు.

ఏపీలో ఓటర్ల జాబితాల రూపకల్పనలో అక్రమాలు జరిగాయని టీడీపీ ఆరోపిస్తోంది. వాలంటీర్లను అడ్డుపెట్టుకుని పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడారని ఆరోపిస్తోంది. అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు ఆధారాలనూ సమర్పించేందుకు చంద్రబాబు ఈ నెల 28న ఢిల్లీ వెళుతున్నట్లు ప్రకటించింది.

మరోవైపు ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలకు టీడీపీయే కారణమని వైసీపీ నేత సాయిరెడ్డి నరసనావు పేటలో ఆరోపించారు. టీడీపీ దొంగ ఓట్ల పార్టీ అని నిరూపిస్తామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ నిర్వాకాలను వివరిస్తామన్నారు. ఈ నెల 28న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని చెప్పారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఇతర ప్రతినిధులు సీఈసీని కలువనున్నారు. ‘సీఈసీ ముందు చంద్రబాబు తన వాణి వినిపిస్తారు..మా వాణి మేం వినిపిస్తాం’ అని విజయసాయిరెడ్డి చెప్పారు. ‘రాష్ట్రంలో తెదేపా హయాంలో ఎన్ని దొంగ ఓట్లు చేర్పించారు. ఎన్ని తొలగించాల్సి ఉంది?, దొంగ ఓట్ల పార్టీ తెదేపానా కాదా అనేది మేం నిరూపిస్తామన్నారు.

టీడీపీ ఓట్ల అక్రమాలపై నాడు ఢిల్లీ వేదికగా పోరాడతామని సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ప్రకటించారు. ఓటర్ల జాబితాల్లో అక్రమాలకు సంబంధించి టీడీపీ అసలు స్వభావం అందరికీ తెలిసిందేనని ఓటర్లను మభ్యపెట్టి తనకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను గప్‌చిప్‌గా తొలగించే కార్యక్రమాన్ని ఎవరికీ అనుమానం రానివ్వకుండా నడిపించడంలో చంద్రబాబును మించిన వారు లేరన్నారు.

2019 ఎన్నికలకు ముందు గ్రహించామని అప్పట్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘం దృష్టికి టీడీపీ ఓటర్ల జాబితా అవకతవకల్ని తీసుకెళ్లడంతో చంద్రబాబు కుట్రను ఛేదించామని చెప్పారు. టీడీపీ చేసిన తప్పుడు పనుల వల్ల బాధితులెవరైనా ఉన్నారంటే అది వైఎస్‌ఆర్‌సీపీనే అన్నారు. గతంలో తాము టీడీపీ వ్యూహాన్ని పకడ్బందీగా చెదరగొట్టగలిగామన్నారు.

జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఓటర్ల జాబితాలకు సంబంధించి డబుల్‌ ఓటర్లు, ఫేక్‌ ఓటర్లను తీయిస్తే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60 లక్షల ఓట్లు ఉన్నట్లు తేలిందని వీటిపై మరో మారు క్షేత్రస్థాయి పరిశీలన చేసి వాస్తవాల్ని నిగ్గుతేల్చాలని ఆదేశించారని ప్రజల ఆదరణ పొందుతున్న ప్రభుత్వానికి ఇలాంటి దొంగ ఓట్లు ఆటంకం కలిగించ కూడదని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. 28వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘానికి అన్ని ఆధారాలు సమర్పిస్తామని చెప్పారు.

ఉరవకొండలో జెడ్పీ సీఈవోగా స్వరూపారాణి అనే మహిళా అధికారి 06.07.2017 నుంచి 30.04.2021 వరకు పనిచేశారని,ఆమె టీడీపీ హయాం నుంచి పనిచేశారని సజ్జల వివరించారు. ఆమె పనిచేసిన కాలంలో 4,081 ఓట్లు డిలీట్‌ అయ్యాయని, ఆ తర్వాత భాస్కర్‌రెడ్డి అనే అధికారి 24.06.2021 నుంచి 20-08-2023 వరకు పనిచేసి సస్పెండ్‌ అయ్యారన్నారు. ఆయన హయాంలో 2077 ఓట్లు డిలీట్‌ అయ్యాయని అంటే మొత్తం 6,158 ఓట్లు తొలగించారని చెప్పారు.తొలగించిన వాటిలో 2,912 ఓట్లు ప్రొసీజర్‌ ప్రకారం తొలగించలేదని ఎన్నికల కమిషన్‌ అభ్యంతరం పెట్టి వారిని సస్పెండ్‌ చేసిందన్నారు.

ఉరవకొండలొో ఓట్లు తొలగింపు అనేది తప్పని ఎన్నికల సంఘం ఎక్కడా చెప్పలేదని ప్రొసీజర్‌ అమలులో లోపాలు మినహా అందులో ఎక్కడా రాజకీయ జోక్యం కనిపించలేదన్నారు. ఓట్ల తొలగింపునకు కారణాలేమైనా సరైన ప్రొసీజర్‌ ప్రకారం నడుచుకోని అధికారులపై చర్యలు తీసుకోవడం ఎన్నికల సంఘం బాధ్యత అన్నారు.

టీడీపీ అధికారంలో ఉండగా 2015 నుంచి 2017 వరకు దాదాపు 50.525 లక్షల ఓట్లు జాబితా నుంచి తీయించారని సజ్జల ఆరోపించారు. 2014 ఎన్నికలకు ముందు 3.68 కోట్ల ఓటర్లు ఉంటే ఆ తర్వాత 2018 నాటికి 3.51 కోట్లకు పడిపోయాయన్నారు. ఓటర్ల జాబితాలకు సంబంధించి టీడీపీ ప్రభుత్వం ఏం అక్రమాలు చేస్తుందో తెలియదని. ఎప్పుడైతే, ఒక్కసారిగా లక్షల ఓట్లును తీయించేశారని తెలియగానే దానిపై దృష్టి పెట్టామని చంద్రబాబు కుట్రను ఛేదించడానికి 2018 నుంచి 2019 వరకు వైఎస్‌ఆర్‌సీపీ పోరాడిందన్నారు.

2019 నాటికి 31.97 లక్షల ఓట్లను లీగల్‌గా పోరాడి ఓటర్ల జాబితాల్లోకి చేర్పించు కున్నామని సజ్జల చెప్పారు. దీంతో ఒరిజినల్‌ ఓటర్ల సంఖ్య 3.98 కోట్లకు జాబితా చేరిందన్నారు.2023 వచ్చేసరికి ఆ ఓటర్ల జాబితా 3.97 కోట్లు ఉందని ఇందులో తొలగింపు ఓటర్లకు సంబంధించి అన్ని ఆధారాలు ఎన్నికల కమిషన్‌ దగ్గర పకడ్బందీగానే ఉన్నాయన్నారు. పనిగట్టుకుని టీడీపీ ఓట్లు తొలగించలేదన్నారు.