bandi sanjay
తెలంగాణ రాజకీయం

ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బండి సంజయ్..

మతపరంగా ఓ వర్గం ప్రజలను కించపరుస్తున్నారనే ఆరోపణలపై ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గేపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు.

డీఎంకే నేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారానికి తెరలేపాయి. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనా వంటి వ్యాధులతో పోల్చారు. దానిని వ్యతిరేకించడం కాదు.. పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. దీంతో హిందుత్వ వాదులు, బీజేపీ నేతలు ఉదయనిధి స్టాలిన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా.. సనాతన ధర్మాన్ని అంతమొందించాలని ఉదయనిది చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఉదయనిది వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

బండి సంజయ్ మాట్లాడుతూ.. సనాతన ధర్మం జోలికొస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సనాతన ధర్మాన్ని అంతమొందించాలని ప్రయత్నించినవాళ్లు సమాధుల్లో ఉన్నారని, ఔరంగజేబు నుంచి మొదలుకొని బ్రిటిష్ వాళ్ల వరకు వాళ్లే కనుమరుగయ్యారని సంజయ్ అన్నారు. ఇస్లాంకు వ్యతిరేకంగా నుపూర్ శర్మ, రాజాసింగ్ మాట్లాడారని పార్టీ నుండి సస్పెండ్ చేస్తే సంకలు గుద్దుకున్న పార్టీలు ఇవ్వన్నీ. గతంలో తాత రాముడు ఇంజనీరా? అని మాట్లాడినాడు. ఇప్పుడు మనవడు సనాతర ధర్మాన్ని అంతమొందిస్తా అంటున్నాడు. సనాతన ధర్మం గురించి మాట్లాడింది సోనియాగాంధీ కొడుకు అయినా స్టాలిన్ కొడుకు అయినా ఒక్కటే. ఉదయ్ నిధి స్టాలిన్ మాట్లాడిన మాటలపైన I.N.D.I.A కూటమి తమ స్టాండ్ ఏంటో చెప్పాలి అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. I.N.D.I.A కూటమి తమ స్టాండ్ చెప్పకపోతే చరిత్రలో తప్పుచేసిన వారిగా మిగిలిపోతారని సంజయ్ అన్నారు.

ఇదిలాఉంటే.. మతపరంగా ఓ వర్గం ప్రజలను కించపరుస్తున్నారనే ఆరోపణలపై ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గేపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే మతపరంగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ ఉదయనిధి, ప్రియాంక ఖర్గేలపై న్యాయవాదులు హర్ష గుప్తా, రామ్ సింగ్ లోధిలు యూపీలోని రామ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.