medical
తెలంగాణ

ఒకేసారి 9 మెడికల్ కాలేజీలు చరిత్ర క్రియేట్ చేశామన్న కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవడం రాష్ట్ర చరిత్రలో ఉజ్వలమైన దినం ఇది అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఒకేసారి తొమ్మిది వైద్య కళాశాలలు ప్రారంభించుకోవడం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం అని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రగతి భవన్ నుంచి వర్చువల్ విధానంలో ఒకేసారి 9 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల్లో ఈ కాలేజీలు ఏర్పాటు కాబోతున్నాయి. ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటామని, కానీ ఈ కార్యక్రమం ఎంతో ఆత్మసంతృప్తి కలిగిస్తుందని తెలిపారు. పరిపాలన చేతకాదు అని ఎగతాళి చేసిన పరిస్థితుల నుంచి ఇప్పుడు తెలంగాణలోని ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నామని కేసీఆర్ అన్నారు. గతంలో రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలు ఉంటే.. ఇవాళ ఆ సంఖ్య 26కు చేరుకుందని తెలిపారు.

వచ్చే విద్యా సంవత్సరానికి 8 కాలేజీలు కొత్తగా ప్రారంభం కాబోతున్నట్లు తెలిపారు. ఈ కొత్త వైద్య కళాశాలలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం కూడా లభించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.2014లో రాష్ట్రంలో 2,850 మెడికల్ సీట్లు ఉంటే 2023 నాటికి 8,515 మెడికల్ సీట్లు ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా వైద్యశాఖ మంత్రి, కార్యదర్శిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. 85 శాతం మెడికల్ సీట్లు తెలంగాణ బిడ్డలకే దక్కాలని పటిష్టంగా పోరాటం చేసి హైకోర్టులో విజయం సాధించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేటు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ద్వారా ప్రతి సంవత్సరం 10 వేల మంది వైద్యులను ఉత్పత్తి చేయబోతున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ఎక్కడైతే వైద్యారోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉంటుందో.. అక్కడ తక్కువ మరణాలు, నష్టాలు సంభవిస్తాయని కేసీఆర్ అన్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకునే మెడికల్ కాలేజీలతో పాటు అద్భుతమైన ఆస్పత్రులను కూడా తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనతగా తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఆస్పత్రులు నిర్మాణం కాబోతున్నాయని.. త్వరలోనే 50 వేల పడకలకు చేరుకోబోతున్నట్లు వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కిట్ అంటే.. నాలుగు సబ్బులు, మూడు వస్తువులు కాదని.. వేజ్ లాస్ ను భర్తీ చేయడమే కేసీఆర్ కిట్ వెనక ఉన్న ఫిలాసఫీ అని కేసీఆర్ స్పష్టం చేశారు. నిరుపేద మహిళలు గర్భం దాల్చిన తర్వాత కూడా కూలీ పనులకు వెళ్తుంటారని.. వారి ఆరోగ్యాన్ని, శిశువు ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశంతో మానవీయ కోణంలో తీసుకు వచ్చిందే కేసీఆర్ కిట్ అని తెలిపారు. అమ్మ ఒడి వాహనాల ద్వారా గర్భిణీలను ఆస్పత్రులకు తీసుకు వచ్చి చికిత్స చేయిస్తున్నామని, డెలివరీ తర్వాత తల్లీబిడ్డలను వారి ఇంటికి తరలిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఇలాంటి సౌకర్యం మరే రాష్ట్రంలోనూ లేదని వెల్లడించారు. కేసీఆర్ కిట్ తో మంచి ఫలితం వచ్చినట్లు కేసీఆర్ తెలిపారు. 2014లో తల్లులు 92 మంది చనిపోతే.. ఇవాళ 43 కు తగ్గించినట్లు తెలిపారు. శిశు మరణాలను 21కి తగ్గించామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరిగేతే.. ఇప్పుడు 76 శాతానికి పెంచామన్నారు.
 

ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు
దేశంలోనే వైద్యరంగంలో తెలంగాణలో శుక్రవారం సరికొత్త రికార్డు నమోదైంది. ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, జనగాం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలను సీఎం కేసీఆర్‌ సాక్షాత్తు ప్రారంభించారు.

తెలంగాణ నుంచి ఏడాదికి 10 వేల మంది డాక్టర్లు తయారవుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. బోధనా కాలేజీలే కాదు, వాటికి అనుబంధంగా ఆస్పత్రులు కూడా ఉంటాయన్నారు. రాష్ట్రంలో 50 వేల పడకల్ని ఆక్సిజన్‌ బెడ్స్‌గా మార్చుకున్నాని తెలిపారు. 10 వేల సూపర్‌ స్పెషాలిటీ బెడ్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు, పారామెడికల్ కోర్సులు అందుబాటులోకి రానున్నట్లు సీఎం తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శాంతికుమారితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వైద్యఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం పండుగ వాతావరణంలో నిర్వహించింది. మెడికల్ కాలేజీ ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని ఇటీవల మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయా జిల్లా కేంద్రాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.

కనీసం 15-20 వేల మందితో జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. ఇందులో యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటుతో పాటు అదనంగా అందుబాటులోకి రానున్న దవాఖానతో విద్యార్థులకే కాకుండా ప్రజలకు కూడా అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందుతాయని తెలిపారు.కేవలం కార్పొరేట్ దవాఖానల్లో మాత్రమే అందుబాటులో ఉండే ప్రపంచ స్థాయి రోబోటిక్ వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్, ఎంఎన్‌జే డిస్పెన్సరీలకు విస్తరించింది. తద్వారా పేద ప్రజలకు నాణ్యమైన, అధునాతన వైద్య సేవలు ఉచితంగా అందుతున్నాయి. నిమ్స్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఇటీవల రూ.156 కోట్లు మంజూరు చేయడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ ప్రాంతంలో గుండెకాయ లాంటి హైదరాబాద్ వాసుల వైద్య అవసరాలను తీర్చేందుకు జీహెచ్ ఎంసీ పరిధిలోని 6 జోన్లకు 6 డీఎంహెచ్ ఓ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. గాంధీలో సంతానోత్పత్తి కేంద్రం, అవయవ మార్పిడి కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.

గాంధీ, నిమ్స్‌, అల్వాల్‌లో సూపర్‌స్పెషాలిటీ ఎంసీహెచ్‌లు నిర్మాణంలో ఉన్నాయి. జీహెచ్‌ఎంసీలో 350 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేశారు. అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్ ను అధునాతన వైద్య సేవలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చి మెడికల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం విశేషం.