రోడ్డుపై పోగొట్టుకున్న లక్షన్నర రూపాయలను సంబంధిత వ్యక్తికి అప్పగించిన యువకుడిని పోలీసులు ప్రశంసించారు. మైలాడుదురై జిల్లా, తరంగంబాడి సమీపాన ఉన్న వెల్‌లైకోవిల్‌కు చెందిన వ్యక్తి రజనీసెల్వం. ఇతని భార్య సర్గుణ. వీరు తమ బిడ్డతోపాటు మోటార్‌సైకిల్‌పై వివాహపు నగల కొనుగోలుకు కారైక్కాల్ వెళ్లారు. ఆ సమయంలో చిన్న హ్యాండ్‌బ్యాగ్‌లో రూ.90 వేల నగదు, రూ.60 వేల విలువైన వెండి నగలు తీసుకువెళ్లారు. ఇదిలా ఉండగా సర్గుణ చేతిలోనున్న హ్యాండ్‌బ్యాగ్ హఠాత్తుగా కనిపించలేదు.
భార్యాభర్తలు రోడ్డంతా వెదికినా లభించలేదు. దీనిగురించి వారు పొరైయూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సమయంలో దంపతులు పోగొట్టుకున్న హ్యాండ్‌బ్యాగ్‌ను తరంగంపాడికి చెందిన యువకుడు క్రిస్టన్ పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చాడు. ఇన్‌స్పెక్టర్ పెరియసామి, ఎస్‌ఐలు వెంకటాచలం, మురుగవేల్ కన్నన్ సమక్షంలో రజినీసెల్వం, సర్గుణ దంపతులకు రూ.లక్షన్నర విలువైన నగదు, నగలున్న హ్యాండ్‌బ్యాగ్‌ను క్రిస్టన్ అప్పగించాడు. ఆ యువకుడికి దంపతులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే, యువకుడు క్రిస్టన్‌ను పోలీసులు, స్థానికులు ప్రశంసించారు.