ఒడిశా పూరిలోని జగన్నాథ ఆలయ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్నాథ ఆలయానికి వచ్చే భక్తులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. ఈ విధానాన్ని వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయాలని నీతి సబ్ కమిటీ నిర్ణయించింది. అయితే కొంత మంది భక్తులు.. అసభ్యకర దుస్తులు ధరించి వస్తున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ రంజన్ కుమార్ దాస్ మాట్లాడుతూ.. ఆలయ గౌరవం, పవిత్రతను కాపాడుకోవడం మన బాధ్యత అని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తూ కొంతమంది భక్తులు అసభ్యకర దుస్తులు ధరించి వస్తున్నారని, మతపరమైన మనోభావాలను పట్టించుకోవడం లేదని తెలిపారు. జీన్స్‌లు ధరించడం, స్లీవ్ లెస్ దుస్తులు, హాఫ్ ప్యాంట్స్ ధరించి బీచ్‌లోకి వెళ్లిన మాదిరిగా ఆలయంలోకి ప్రవేశిస్తున్నారని పేర్కొన్నారు. మతపరమైన మనోభావాలను పట్టించుకోకుండా ఆలయాన్ని సందర్శిస్తున్నారని తెలిపారు.
దేవాలయం పవిత్రమైన స్థలం.. వినోదాన్ని పంచే ప్రాంతం కాదని ఆయన స్పష్టం చేశారు. 2024, జనవరి 1వ తేదీ నుంచి సంప్రదాయ దుస్తులు ధరించిన వారిని మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి భక్తులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించినట్లు రంజన్ కుమార్ దాస్ పేర్కొన్నారు.