స్విస్ బ్యాంక్‌లో భారతీయుల ఖాతాలకు సంబంధించి తాజా వివరాలు కేంద్ర ప్రభుత్వానికి అందాయి. అంతర్జాతీయ స్థాయిలో కుదిరిన ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈవోఐ) ఒప్పందం కింద పౌరులు, సంస్థలకు చెందిన అకౌంట్ల సమాచారం స్విస్ పన్నుల శాఖ వర్గాలు భారత్‌కు అందించాయి. కాగా, 2019 నుంచి ఏటా ఈ వివరాలు కేంద్రానికి అందుతుండగా, ఇది ఐదోసారి. సుదీర్ఘ సంప్రదింపుల అనంతరమే భారత్‌కు ఈ వివరాలను ఇచ్చేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం అంగీకరించింది. నిజానికి 2018లోనే ఈ సమాచార మార్పిడిని స్విట్జర్లాండ్ ప్రారంభించింది. ఆ ఏడాది భారత్ మినహా 36 దేశాలకు వివరాలిచ్చింది. గత ఐదేండ్లుగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో భారత్‌తోపాటు వివిధ దేశాలకూ వారి పౌరుల, సంస్థల ఖాతాల వివరాలను స్విట్జర్లాండ్ ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాదికిగాను భారత్ సహా 104 దేశాలకు దాదాపు 36 లక్షల ఫైనాన్షియల్ అకౌంట్స్ వివరాలు గత నెల విడుదలయ్యాయి. నల్లధనంపై ఆయా దేశాలు సాగిస్తున్న పోరులో ఈ సమాచారమే అత్యంత ప్రధానంగా నిలుస్తున్నది.
వందలాది ఖాతాలు తాజా విడుత సమాచారంలో భారత పౌరులు, కార్పొరేట్లు, ట్రస్టులకు చెందిన వందలాది ఖాతాలున్నట్టు స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌టీఏ) అధికార వర్గాలు సోమవారం పేర్కొన్నాయి. అమెరికా, బ్రిటన్‌తోపాటు పలు ఆగ్నేయాసియా దేశాలు, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల్లో ఉన్న ఎన్నారైల ఖాతాల వివరాలు ఇందులో ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే గత ఐదేండ్లుగా వస్తున్న ఖాతాల వివరాల్లో 2018కి ముందు ముగిసిన వాటి వివరాలే ఎక్కువ. ఇక గత ఏడాది 101 దేశాలకు ఈ వివరాలు వెళ్లగా.. ఈ ఏడాది కజకిస్తాన్, మాల్దీవులు, ఒమన్ అదనంగా చేరాయి. ఈసారీ రష్యా జాబితాలో లేదు. మరోవైపు ఏటేటా సుమారు 2 లక్షల ఖాతాలు పెరుగుతుండటం గమనార్హం. తమతో అనుసంధానమైన దాదాపు 9,000 బ్యాంకులు, ట్రస్టులు, ఇన్సూరర్ల ద్వారా సమాచారాన్ని సేకరించి ఆయా దేశాలకు ఏటా ఎఫ్‌టీఏ అందిస్తున్నది. అంతర్జాతీయ స్థాయి నిబంధనల్ని పాటించని దేశాలకు మాత్రం ఈ సమాచారాన్నివ్వడం లేదు.
ఖాతాల్లో ఎంత?
ఖాతాదారుల పేర్లు, వారి దేశం, చిరునామా తదితర కీలక వివరాలతోపాటు ఖాతాలో ఉన్న నగదు విలువనూ ఆయా దేశాలతో చెప్పినట్టు సదరు అధికారులు వెల్లడించారు. అయితే బహీర్గతం చేసిన ఖాతాల్లో మొత్తం ఎంత ఉన్నదన్న వివరాలను మాత్రం స్విస్ అధికారికంగా వెల్లడించలేదు. సమాచార మార్పిడి గోప్యత, ఇతరత్రా ప్రతికూల ప్రభావాల కారణంగానే తెలియపర్చడం లేదని చెప్పుకొచ్చింది. తామిచ్చిన వివరాలతో ఆయా దేశాలు తమ పౌరులు, సంస్థల పన్ను ఎగవేతలపై సమగ్ర దర్యాప్తును చేపట్టుకోవచ్చన్నది. మనీ లాండరింగ్, ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సాయం వంటి వాటిపై కఠినంగా వ్యవహరించవచ్చని చెప్పింది. ఇక వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో మరో విడుత స్విస్ బ్యాంక్ ఖాతా వివరాలు వస్తాయని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. కాగా, తమ దేశంలో విదేశీయులకున్న రియల్ ఎస్టేట్ ఆస్తుల వివరాలనూ పంచుకునేందుకు స్విట్జర్లాండ్ గతంలోనే అంగీకరించిన సంగత79ి విదితమే.