‘డెల్టా’ మహా ప్రమాదకారి.. ఒకరి నుంచి 8 మందికి వ్యాప్తి.. డబ్ల్యూహెచ్ వో ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్
కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్ హెచ్చరించారు. డెల్టా వేరియంట్ వ్యాప్తి, నిదానంగా సాగుతున్న వ్యాక్సినేషన్ తో ప్రపంచంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. డెల్టా సోకిన వ్యక్తి నుంచి సగటున 8 మందికి వ్యాపిస్తోందన్నారు. గత 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా 5 లక్షల కేసులు నమోదు కాగా, 9,300 మంది మరణించారని ఆమె చెప్పారు. కరోనా ఇంకా నెమ్మదించలేదనడానికి ఇదే సంకేతమన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
‘డెల్టా కరోనా’ చాలా ప్రమాదకారి అని, దాంతోనే ఇప్పుడు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పారు. మామూలు కరోనా సోకిన వ్యక్తి నుంచి మహా అయితే ముగ్గురికి వైరస్ అంటుతుందని, కానీ, డెల్టా సోకిన వ్యక్తి నుంచి 8 మందికి వ్యాపిస్తోందని ఆమె హెచ్చరించారు. లాక్ డౌన్ ఎత్తేయగానే ఇటు ప్రజలూ కొంచెం సేద తీరేందుకు టూర్లకు వెళ్తున్నారని, కనీసం కరోనా నిబంధనలను పట్టించుకోవడం లేదని అన్నారు. గుమికూడుతూ ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు కేసులు పెరగడానికి ఇదీ ఒక కారణమేనన్నారు.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ నెమ్మదించిందని ఆమె అన్నారు. ఎక్కువ మందికి టీకాలు ఇచ్చిన దేశాల్లో ఆసుపత్రుల పాలయ్యే ముప్పు చాలా చాలా తగ్గిందని ఆమె గుర్తు చేశారు. కానీ, ఇప్పటికీ వ్యాక్సిన్ అందని దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని, ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ చాలట్లేదని, మరణాలు ఎక్కువ అవుతున్నాయని సౌమ్య ఆందోళన వ్యక్తం చేశారు.