రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామ సర్పంచ్ రాజిరెడ్డి, డీఆర్‌డీవో కౌటిల్య చొరవ తనను ఎంతగానో ఆకట్టుకుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సముద్రలింగాపూర్ గ్రామంలో నిర్మించిన సామూహిక గొర్రెల షెడ్లను మంత్రి గురువారం ప్రారంభించారు. గొర్రెలు, మేకల పెంపకం కోసం గ్రామంలో 42 ప్రత్యేకమైన షెడ్లను నిర్మించారు. వీటిని గొర్రెల పెంపకందారుల కుటుంబాలకు మంత్రి చేతుల మీదుగా అప్పగించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రూ.500 కోట్లతో గొర్రెల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా ఎక్కడాలేని విధంగా సామూహిక గొర్రెల షెడ్లను నిర్మించి కాపరులకు అందజేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఆదాయం పెంచి పేదలకు పంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.