ఏపీ బీజేపీలో వర్గపోరు పీక్స్ లో ఉంది. జనంలో కొద్దిపాటి ఆదరణ కూడా లేని పార్టీలో వర్గ పోరు మాత్రం తారస్థాయిలో ఉంది. పొకాకు బోర్డు చైర్మన్ గా ప్రకాశం జిల్లాకు చెందిన యశ్వంత్ ను నియమిస్తూ బీజేపీ హై కమాండ్ తీసుకున్న నిర్ణయం ఏపీ వ్యవహారాలలో బీజేపీ హై కమాండ్ ఇప్పటికీ సోము వీర్రాజు మాటకే విలువనిస్తున్నదనడానికి నిదర్శనంగా చెబుతున్నారు. యశ్వంత్ పార్టీలో చేరి మూడేళ్లైంది. కిసాన్ సెల్ రాష్ట్ర పధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. అటువంటి యశ్వంత్ ను పొగాకు బోర్డు చైర్మన్ గా నియమించడం వెనుక బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు సిఫారసు ఉందని అంటున్నారు. ఈ నియామకం విషయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి కనీస సమాచారం కూడా లేదని అంటున్నారు. బీజేపీ ఏపీ శాఖ పట్ల ఆ పార్టీ అధిష్ఠానం వ్యవహరిస్తున్న తీరు. రాష్ట్రంలో పార్టీ ప్రతిష్టను పాతాళానికి దిగజార్చేశారంటూ సోము వీర్రాజును ఆ పదవి నుంచి తప్పించి పార్టీ రాష్ట్రపగ్గాలను పురంధేశ్వరికి అప్పగించిన బీజేపీ హై కమాండ్ ఇప్పటికీ సోము వీర్రాజు మాటకే ఎక్కువ విలువ ఇస్తోందా, జగన్ సర్కార్ అక్రమాలు, అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై పురంధేశ్వరి ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా ఆమెకు కంఠశోష మాత్రమే మిగిలేటట్లు చేస్తోందా అంటే పరిశీలకులు అవుననే విశ్లేషిస్తున్నారు.
ఏపీ అడ్డగోలు అప్పులు, నిబంధనల ఉల్లంఘనపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు పురంధేశ్వరి గణాంకాలు, ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన రోజుల వ్యవధిలోనే పార్లమెంటు సాక్షిగా ఏపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలు భేష్ అంటూ నిర్మలా సీతారామన్ కితాబిచ్చారు. అందుకు ఆమె ఆర్బీఐ నివేదికను చూపారు. అది కూడా పాక్షిక నివేదికే అన్న ఆరోపణలు, విమర్శలూ అప్పట్లోనే వచ్చాయి. అయితే సాంకేతికంగా ఎప్పుడో మూడు నెలల ముందు ప్రశ్నకు ఆమెకు గతంలో అందిన సమాచారం మేరకే సమాధానం ఇచ్చారని పార్టీ వివరణ ఇచ్చుకుంది. అది పక్కన పెడితే.. ఏపీలో మద్యం విధానం పెద్ద కుంభకోణం అంటూ ఆధారాలతో సహా నివేదికను అందించి, కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలని పురంధేశ్వరి డిమాండ్ చేసినా ఇంత వరకూ హైకమాండ్ నుంచి స్పందన లేదు. అయితే సోము వీర్రాజు సిఫారసు మేరకు మాత్రం ఓ కేంద్ర కార్పొరేషన్ చైర్మన్ పదవిని మాత్రం ఆఘమేఘాల మీద కట్టబెట్టారు.
దీనిపై పురంధేశ్వరి తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ హైకమాండ్ కు లేఖ రాశారు. బీజేపీలో ఎవరికైనా కార్పొరేషన్ పదవులు రావాలంటే.. సంబంధిత వ్యక్తికి చెందిన రాష్ట్ర శాఖ అధ్యక్షుడి సిఫారసు అవసరం అన్న నిబంధన ఉంది. కానీ సోము గతంలో చేసిన సిఫారసునే పరిగణనలోనికి తీసుకున్న బీజేపీ హై కమాండ్ ప్రస్తుత అధ్యక్షురాలికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవడంపై పురంధేశ్వరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ జాతీయ సంఘటనా మంత్రి బీఎల్ సంతోష్‌జీకి ఫోన్ చేసి, తన అభ్యంతరాన్ని వ్యక్తం చేయడమే కాకుండా, ఈ నియామానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఆపాలని ఆమె గట్టిగా కోరినట్లు చెబుతున్నారు. మరి బీజేపీ ఏపీలో పోగాకు బోర్డు చైర్మన్ పదవి వివాదాన్ని అధిష్ఠానం ఎలా పరిష్కరిస్తుందో? సోము సిఫారసుకే విలువనిచ్చి నోటిఫికేషన్ జారీ చేస్తుందా? పురంధేశ్వరి అభ్యంతరాన్ని పరిగణనలోనికి తీసుకుని నియామకాన్ని వెనక్కు తీసుకుంటుందా అన్నది ఆసక్తిగా మారింది.