UN
అంతర్జాతీయం రాజకీయం

గాజాలో ఇజ్రాయెల్‌ యుద్ధం ఆపాలని యూఎన్‌ తీర్మానం..

 ఇజ్రాయెల్‌ – హమాస్‌ యుద్ధం నేపథ్యంలో గాజాలో మానవతా సహాయం కోసం యుద్ధాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ ఐక్య రాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించింది. ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానానికి 12 దేశాలు మద్దతు తెలిపారు. అమెరికా, రష్యా, బ్రిటన్‌లు ఓటింగ్‌లో పాల్గొనలేదు. గాజా స్ట్రిప్‌లో మానవతా సహాయం కోసం అంతర్జాతీయ మానవతా చట్టానికి చట్టబడి ఉండాలని తీర్మానం డిమాండ్‌ చేసింది. పిల్లలకు రక్షణ కల్పించాలని స్పష్టం చేసింది. చైనా, రష్యాలు తక్షణం కాల్పుల విరమణ ప్రకటించాలని కోరుతుండగా.. అయితే, ఆగ్నేయాసియా దేశాల కూటమి యుద్ధాన్ని ఆపాలని విజ్ఞప్తి చేసింది.గాజాపై దాడులను వెంటనే ఆపాలని ఆగ్నేయాసియా దేశాల రక్షణ మంత్రుల సమావేశం బుధవారం ఇజ్రాయెల్‌కు సూచించింది. మానవతా సహాయం కోసం సురక్షితమైన కారిడార్‌ను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా.. గాజాలో ప్రధాన ఆసుపత్రి అల్‌ షిపా ఆసుపత్రిని ఇజ్రాయెల్‌ సైన్యం తన నియంత్రణలోకి తీసుకున్నది.

ఆసుపత్రిలో దాచిన పెద్ద సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ తెలిపింది. అంతకు ముందు ఆసుపత్రి వద్ద హమాస్‌కు, ఇజ్రాయెల్‌ సైన్యానికి మధ్య కాల్పులు జరిగాయి. ఇంకా ఆసుప్రతిలో ఉగ్రవాదులు ఉండవచ్చని ఐడీఎఫ్‌ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రతి మూలలోనూ గాలిస్తున్నది.లౌడ్‌ స్పీకర్లు ఏర్పాటు చేసి హమాస్‌ ఉగ్రవాదులు లొంగిపోవాలని కోరుతున్నది. అయితే, ఇజ్రాయెల్‌ సైన్యం అల్‌ షిఫా ఆసుపత్రిపై నియంత్రణ సాధించడంతో అక్కడి వైద్యులను సంప్రదించడం సాధ్యంకాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. రోగులు, సిబ్బంది సహా దాదాపు 2300 మంది ఆసుపత్రిలో ఉన్నారని ఐరాస పేర్కొంది. గాజాలో యూఎన్‌ రిలీఫ్‌ చీఫ్‌ మార్టిన్‌ గ్రిఫిత్స్‌ మాట్లాడుతూ ఆసుపత్రులు యుద్ధ భూమికాదన్నారు. నవజాత శిశువులు, రోగులు, వైద్య సిబ్బంది, ఆసుపత్రిలోని పౌరుల భద్రతపై ఇతరవాటి కంటే ఎక్కువ ఆందోళన ఉండాలన్నారు. దీనిపై ఐడీఎఫ్‌ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్‌ కర్నల్‌ పీటర్‌ లెర్నర్‌ మాట్లాడుతూ హాస్పిటల్‌ కాంప్లెక్స్‌ను హమాస్‌ ప్రధాన కార్యాలయంగా ఉపయోగిస్తుందనడానికి బలమైన ఆధారాలు లభించాయని చెప్పారు.