ap secretariat
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

ఏపీ సచివాలయంలో లంచావతారం

ఏపీ సచివాలయంలో ఏసీబీ దాడుల  కలకలం రేగింది. సచివాలయం బస్సు షెల్టర్ వద్ద నాటకీయంగా ఆర్థిక శాఖ సెక్షన్ ఆఫీసర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ దాడి చేసింది. ఆర్థిక శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న నాగభూషన్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కాడు. వెలగపూడి సచివాలయం బస్ షెల్టర్ వద్ద రూ.40,000 లంచం తీసుకుంటుండగా నాగభూషన్‌రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. విదేశీ విద్యోన్నత నిధులు మంజూరుకు సంబంధించిన ఫైలును క్లియర్ చేయడానికి నాగభూషణ్  రెడ్డి ఓ విద్యార్థి తండ్రిని  లంచం అడిగాడు. అతను ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. నిఘా పెట్టిన ఏసీబీ డబ్బులు తీసుకుంటూండగా అరెస్టు చేశారుఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో ఇప్పటి వరకూ ఏసీబీ  దాడులు జరగలేదు. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు ఎలాంటి సోదాలు నిర్వహించలేదు.

అయితే హఠాత్తుగా ఇటీవల ఏసీబీ అధికారులు సెక్రటేరియట్ ఉద్యోగులపై ప్రత్యేకంగా నిఘా ఉంచినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఏసీబీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తూండటంతో.. వాటిపై దృష్టి పెట్టి ఉద్యోగుల అవినీతిని బయట పెట్టాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. నేరుగా సెక్రటేరియట్ లో ఏసీబీ దాడులు జరగడం ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపింది. సెక్రటేరియట్ లోనే కాకుండా.. అవినీతి గురించి తమకు వచ్చిన ఫిర్యాదులపై స్పందించి ఆధారాలు ఉంటే.. నిఘా పెట్టి.. రెడ్ హ్యాండెడ్  గా పట్టుకుంటున్నామని ఏసీబీ పోలీసులు చెబుతున్నారు. ఇటీవల పలువురు అధికారులు ఇలా దొరికిపోయారు. ఆ తర్వాత ఏపీ ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఉద్యోగులపై ఏసీబీ దాడులను ఖండించారు. సరిగ్గా జీతాలివ్వడం లేదని ఆయినా ఇలా వేధిస్తున్నారని ఆరోపించారు. దీనికి ఏసీబీ అధికారులు ఖండన ప్రకటన ఇచ్చారు. లంచాలు తీసుకుంటే.. ఎవరినైనా అరెస్టు చేస్తామని.. తమకు వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధికం రెవిన్యూ అధికారుల లంచాల గురించేనని చెబుతున్నారు.

ఎన్నికలకు మూడు నెలల ముందు ఏసీబీ దాడులను పెంచడం వెనుక.. ఉద్యోగులను నోరెత్తకుండా చేసే ప్రయత్నం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు అనుమానిస్తున్నారు. ఉద్యోగులు ఎన్నికలకు ముందు ప్రభుత్వం నుంచి తమ కు రావాల్సిన వాటిపై డిమాండ్లు పెట్టడం.. ఆందోళనలు చేయడం సహజమని.. అలాంటివి ఈ సారి ఉండకుండా  ఇలా ఏసీబీ దాడులతో బెదిరిస్తున్నారని .. ఉద్యోగ సంఘాలు అనుమానిస్తున్నాయి.