patha basthi
తెలంగాణ రాజకీయం

పాతబస్తీలో ఎంఐఎం కోటకు బీటలు

తెలంగాణ ఎన్నికల పలితాల తర్వాత రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోవడం కనిపిస్తోంది. బీఆర్ఎస్  ఓటు బ్యాంక్ తగ్గడం, ఆ ఓటు బ్యాంక్ బీజేపీకి మళ్లడంపై భవిష్యత్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఆసక్తి ఏర్పడుతోంది. అదే సమయంలో  పాతబస్తీలో పాతుకుపోయిన మజ్లిస్ కూ గండం పొంచి ఉందని ఫలితాలను బట్టి స్పష్టమైంది. కంచు కోటల్లాంటి నియోజకవర్గాల్లో మజ్లిస్   గట్టి పోటీ ఎదుర్కొంది. ఎవరూ పోటీ లేకపోయినా.. ఇలాంటి పరిస్థితి ఉంటే.. తమకు పోటీగా మరో పార్టీ వస్తే.. మజ్లిస్ కు వచ్చే ఫలితాల గురించి చెప్పాల్సిన పని లేదు. అందుకే ఇప్పుడు మజ్లిస్ ఏం చేయబోతోంది ? మజ్లిస్ ను టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ ఏం చేయబోతోందన్న ఆసక్తి ఏర్పడుతోంది.మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్ షార్ట్ కట్ లో మజ్లిస్ , ఎంఐఎం అంటారు. ఓవైసీ కుటుంబ ఆస్తి లాంటి పార్టీ. పాతబస్తీలో ముస్లింలకు తామే పరిరక్షకులకమని..తమను కాదంటే మీరు బతకలేరన్నట్లుగా అక్కడి ప్రజలకు నూరి పోస్తారు. ఇదొక్కటే కాదు.. వారి విజయరహస్యం పాతబస్తీలోకి తమ పార్టీకి పోటీగా మరో పార్టీ రాకుండా చూసుకోవడం. ఇందు కోసం మజ్లిస్ చాలా ప్రత్యేకమైన వ్యూహాలను అమలు చేస్తూ ఉంటుంది.. అందులో ఒకటి అధికార పార్టీతో సన్నిహితంగా ఉండటం.

తెలంగాణలో ఎవరు అధికారంలో ఉంటే వారితో సన్నిహితంగా ఉండి.. పాతబస్తీలోకి మీరు రావొద్దు.. బయట అంతా మా పార్టీ మీకు మద్దతు ఇస్తుందని ఒప్పందాలు చేసుకుంటారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు అదే వ్యూహం పాటించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అదే పాటించారు. మొన్నటి ఎన్నికల్లోనూ అదే పాటించారు. ఇలాంటి వ్యూహం పాటించిన ప్రతీ సారి మంచి ఫలితాలు సాధించారు. గత రెండు దశాబ్దాలుగా వారికి ఎదురు లేకుండా పోతోంది. అయితే మజ్లిస్ పై ఓటర్లకు మొహం మెత్తుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో యాకత్పురా, మలక్ పేట, నాంపల్లిలో గట్టి పోటీ ఇచ్చారు. యాకత్పురా స్థానంలో అతి తక్కువ ఓట్లతో బయటపడ్డారు. బీఆర్ఎస్ తో పాటు ఇతర హిందూ అభ్యర్థులు ఓట్లు చీల్చడంతో వెయ్యి ఓట్లతో బయట పడ్డారు. నాంపల్లి గురించి చెప్పాల్సిన పని లేదు. ఓ దశలో మజ్లిస్ కూడా ఆశలు వదిలేసుకుంది. మలక్ పేటలో ఎప్పుడూ గట్టి పోటీ ఎదుర్కొంటూనే ఉంది. దీనికి కారణం యూకత్పురాలో మజ్లిస్ బచావో తెహరీక్.. ఎంబీటీ గట్టి పోటీ ఇవ్వడం.. నాంపల్లి, మలక్ పేటలో కాంగ్రెస్ పుంజుకోవడం. గతంలోలా ఏడు స్థానాలూ గెల్చుకున్నప్పటికీ.. మజ్లిస్ భవిష్యత్ ఇప్పటిలా వెలుగుల్లో ఉండే అవకాశం లేదని మాత్రం స్పష్టమవుతోంది.

మజ్లిస్ ఇప్పుడు పాతబస్తీలో ఆధిపత్యం చెలాయిస్తోంది కానీ.. రెండు దశాబ్దాల కిందట.. ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం, కాంగ్రెస్ ల మధ్య రాజకీయాలు నడుస్తున్నప్పుడు పరిస్థితి వేరుగా ఉండేది. ప్రధాన పార్టీలు పాతబస్తీలో  బలం పెంచుకోలేకపోయినప్పటికీ… మజ్లిస్, ఎంబీటీల మధ్య పోరాటానికి చెరో పార్టీలు సాయం చేసేవి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పాతబస్తీలో మజ్లిస్ బచావో తెహరీక్ పార్టీని చంద్రబాబు ప్రోత్సహించేవారు. ఆ పార్టీ నేత అమానుల్లా ఖాన్ జీవించి ఉన్నప్పుడు మజ్లిస్ పరిస్థితి దారుణంగా ఉండేది. అప్పట్లో చార్మినార్ అసెంబ్లీ సీటు ఒక్కటే ఎంఐఎంకు వచ్చేది. ఎంబీటీకి నాలుగు అసెంబ్లీ సీట్లు ఉండేవి. అందుకే చంద్రబాబు అంటే..  మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ కు ఇప్పటికీ ఆగ్రహం ఉంటుంది. ఎప్పుడూ మజ్లిస్ ను టీడీపీ దగ్గరకు తీయలేదు.  అయితే 2002లో  ఎంబీటీ నేత అమానుల్లా ఖాన్ చనిపోవడంతో పరిస్థితి మారిపోయింది. మెల్లగా  మజ్లిస్.. కాంగ్రెస్ పార్టీ సీఎం వైఎస్ సాయంతో.. పాతబస్తీ మొత్తం బలం పెంచుకుంది. ఎంబీటీని కనుమరుగు చేసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాల్లో వారు సక్సెస్ అయ్యారు. ఇంత కాలం తర్వాత మళ్లీ ఎంబీటీ బౌన్స్ బ్యాక్ అయింది.

యాకత్పురా స్థానంలో గెలిచినంత పని చేసింది. ఇప్పుడు గెలవకపోవచ్చు కానీ.. మజ్లిస్ కు మళ్లీ పాత రోజులు చూపించేందుకు మాత్రం ఆ పార్టీ రెడీగా ఉంది. పాతబస్తీలో మజ్లిస్ ను ఎదుర్కోవడానికి ఎంబీటీకి అధికార పార్టీ మద్దతు అవసరం. అందుకే కాంగ్రెస్ పార్టీకి సన్నిహితం అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ గెలిచినప్పటి నుండి ఎంబీటీ నేత అమ్జాద్ ఉల్లా ఖాన్ రేవంత్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఆ పార్టీతో దగ్గర సంబంధాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.