టీటీడీ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రమని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి అని.. భక్తుల కానుకలతో నడిచే ఏకైక దేవస్థానం టీటీడీ అని చెప్పుకొచ్చారు. రూపాయి కూడా ప్రభుత్వం నుంచి టీటీడీ ఖజానాకు రాదన్నారు. గత కొన్ని ఏళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ నిధులపై కన్నేసిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని.. అందుకు జగన్మోహన్ రెడ్డి కన్ను టీటీడీ ఖజానాపై పడిందన్నారు. టీటీడీ నిధులను దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఇది మంచిది కాదని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుందన్నారు.శ్రీవారి భక్తులను కలుపుకొని అనేక ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నామన్నారు. తిరుపతిలో శానిటేషన్ పేరిట 100 కోట్ల రూపాయలు టీటీడీ నిధులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని తెలిపారు.
రాజకీయ ప్రయోజనాల కోసం టీటీడీ నిధులు వినియోగిస్తున్నారన్నారు. ఇది చైర్మన్ కరుణాకర్ రెడ్డి కుమారుడుని ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు తిరుపతికి టీడీపీ నిధులు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ అయిన తర్వాత మూడు నెలల్లో రూ.200 కోట్ల పైన నిధులను ఖర్చు చేశారన్నారు. ముఖ్యమంత్రి ఇవన్నీ జరుగుతున్న తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నారు మంచిది కాదని భానుప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు.