భారత ప్రధాని నరేంద్ర మోడీ కలలుగన్న అభివృద్ధి భారత్ ప్రపంచ దేశాలతో పోటీపడి మన దేశానికి స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలు కానున్న 2047 నాటికి ముందు వరసలో నిలవనున్నదని కేంద్ర మహిళా సంక్షేమం & చైల్డ్ డెవలప్‌మెంట్ & ఆయుష్ శాఖ సహాయ మంత్రి డా. ముంజ్‌పరా మహేంద్రభాయ్ పునరుద్గాటించారు.
శనివారం మధ్యాహ్నం రేణిగుంట రైల్వే కళ్యాణ మండపంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించి, కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలియజేసి వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి అక్కడే ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు.
మంత్రి మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశం స్వయం సమృద్ధి సాధించేలా అభివృద్ధి చెందడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తున్నదని అన్నారు.
ప్రధానమంత్రి గత మాసం నవంబర్ 15న జార్ఖండ్ నుండి వికసిత్ సంకల్ప భారత్ యాత్ర 30 వేల ప్రచార వాహనాలను ప్రారంభించారని, ప్రతి గ్రామపంచాయతీలో కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించనున్నారని, అర్హులై ఉండి కూడా ప్రభుత్వ పథకాల పొందని వారు ప్రచార వాహనం వద్దే దరఖాస్తులు చేసి అందించి సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్డియాలజీ డాక్టర్ గా నేను అనారోగ్యం పాలై లక్షల ఖర్చులు పెట్టి ఆర్థికంగా ఎంతో మంది నష్టపోయిన వారిని చూశానని నేడు ఆ స్థితి లేదని, రూ. 5 లక్షల విలువ ఉచిత వైద్యంతో ఆయుష్మాన్ భారత్, గ్రామీణ ప్రజల త్రాగునీటి కష్టాలు తీర్చడానికి జలజీవన్ మిషన్ పథకంతో ఇంటింటికి నీటి కులాయి అందించడం, అన్నదాతలను ఆదుకోవడానికి కిసాన్ సమన్ యోజన, అతి తక్కువ ధరలకు మందులు అందేలా జన ఔషధీ కేంద్రాలు, ఒకే దేశం ఒకే రేషన్ కార్డు అనే నినాదంతో కోవిడ్ సమయం నుండి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకంతో గత ఐదు సంవత్సరాలుగా ఉచితంగా రేషన్ పంపిణీ, పీఎం ఆవాస్ యోజన పథకంతో పేదలకు గృహాలు మంజూరు చేస్తున్నారని అన్నారు.
మహిళలకు ఉజ్వల యోజనతో గ్యాస్ సిలిండర్లు, గర్భిణీ స్త్రీలకు మాతృ వందన యోజనతో ఐదు వేల ఆర్థిక సహాయం, ఆడపిల్లలు తల్లిదండ్రులకు బరువు కారాదని సుకన్య సమృద్ధి యోజన పొదుపు పథకం, విద్య కోసం కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, అగ్రగామి చదువులకు ఉచితంగా ఫీజు సౌకర్యం వంటివి ప్రవేశపెట్టారని ఆడపిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటున్నాను అని అన్నారు. నేడు ఢిల్లీ సచివాలయంలో 40 శాతం మంది మహిళ ఉద్యోగులు ఉన్నారని ఆర్మీ నేవీ వంటి వాటిల్లో మహిళల ప్రాధాన్యత పెరిగిందని యుద్ధ విమానాలలోనూ హెలికాప్టర్లలోను మహిళా పైలట్లు గా ఉన్నారని ఇది ప్రపంచంలోనే అధికంగా మహిళల ప్రాతినిధ్యం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నేడు ప్రతి గ్రామ పంచాయతీకి పంపుతున్న మోడీ గ్యారెంటీ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని, 2047 నాటికి తిరుమల బాలాజీ ఆశీస్సులతో అభివృద్ధిలో ప్రపంచ దేశాలలో మొదటిదిగా నిలవాలని కోరుకుంటున్నానని అన్నారు.