formula-e-race
తెలంగాణ

హైద‌రాబాద్‌లో జ‌ర‌గాల్సిన ఫార్ములా ఈ రేస్‌ ను ర‌ద్దు

హైద‌రాబాద్‌లో జ‌ర‌గాల్సిన ఫార్ములా ఈ రేస్‌ ను ర‌ద్దు చేశారు. ఈ-రేస్ సీజ‌న్ 10కు చెందిన నాలుగ‌వ రౌండ్ హైద‌రాబాద్‌లో ఫిబ్ర‌వ‌రి 10వ తేదీన జ‌ర‌గాల్సి ఉంది. అయితే ఆ రేస్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఫార్ములా ఈ రేస్ నిర్వాహ‌కులు ప్ర‌క‌టించారు. తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన మున్సిప‌ల్ శాఖ‌.. హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించిన‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. గ‌త ఏడాది అక్టోబ‌ర్ 30వ తేదీ జ‌ర‌గిన ఒప్పందాన్ని మున్సిప‌ల్ శాఖ ఉల్లంఘించిన‌ట్లు ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.రేస్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన ఫార్ములా ఈ ఆప‌రేష‌న్స్‌.. మున్సిప‌ల్ శాఖకు నోటీసులు జారీ చేసిన‌ట్లు చెప్పింది. కాంట్రాక్టును ఉల్లంఘించినందుకు నోటీసులు ఇచ్చిన‌ట్లు పేర్కొన్న‌ది. హోస్ట్ సిటీ అగ్రిమెంట్ చ‌ట్టాల ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు ఎఫ్ఈవో తెలిపింది.గ‌త తెలంగాణ స‌ర్కార్‌, ఫార్ములా ఈ మ‌ధ్య ఈరేస్ ఒప్పందం జ‌రిగింది. కానీ ప్ర‌స్తుతం తెలంగాణ స‌ర్కార్ ఆ ఒప్పందాన్ని బ్రేక్ చేసింది. సీజ‌న్ 10 రేస్‌లు జ‌ర‌గ‌నున్న న‌గ‌రాల్లో టోక్యో, షాంఘై, బెర్లిన్‌, మొనాకో, లండ‌న్ న‌గ‌రాలు ఉన్నాయి.

జ‌న‌వ‌రి 13వ తేదీ నుంచి ఈ సీజ‌న్ ప్రారంభంకానున్న‌ది. మెక్సికోలోని హాంకూక్ లో తొలి రేస్ జ‌ర‌గ‌నున్న‌ది.తెలంగాణ స‌ర్కారు తీసుకున్న తాజా నిర్ణ‌యం త‌మ‌ను నిరాశ‌ప‌రిచిన‌ట్లు ఫార్ములా ఈ చీఫ్ చాంపియ‌న్‌షిప్ ఆఫీస‌ర్ ఆల్బ‌ర్టో లాంగో తెలిపారు. భార‌త్‌లో మోట‌ర్‌స్పోర్ట్స్ అభిమానుల‌ను తీవ్ర నిరాశ‌కు గురిచేసిన‌ట్లు చెప్పారు. వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్ రేస్ ఈవెంట్‌ను హైద‌రాబాద్ నిర్వ‌హించ‌డం కీల‌క‌మైంద‌ని, కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తు తెలంగాణలో ఏర్ప‌డ్డ కొత్త‌ స‌ర్కార్ నిర్ణ‌యం వ‌ల్ల ఆ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌ లేక‌పోతున్న‌ట్లు ఆల్బ‌ర్టో తెలిపారు.గ‌త ఏడాది జ‌రిగిన ప్రారంభోత్స‌వ రేస్ చాలా స‌క్సెస్ అయ్యింద‌ని, ఆ రేస్ వ‌ల్ల ఆ ప్రాంతంలో సుమారు 84 మిలియ‌న్ల డాల‌ర్ల ఆర్థిక ప్ర‌గ‌తి జ‌రిగింద‌ని ఫార్ములా ఈ సీఈవో జెఫ్ డోడ్స్ తెలిపారు. భార‌తీయ భాగ‌స్వాములు మ‌హేంద్ర‌, టాటా క‌మ్యూనికేష‌న్స్ సంస్థ‌ల‌ను అసంతృప్తికి గురి చేసిన‌ట్లు అయింద‌న్నారు.