అనంతపురం హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ రెండో రోజు పర్యటిస్తున్నారు. బాలయ్యను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. పుట్టపర్తికి చెందిన TNSF రాష్ట్ర ఉపాధ్యక్షుడు, దివ్యాంగుడైన రామాంజనేయ నాయుడిని ఎమ్మెల్యే బాలయ్య ఆప్యాయంగా పలకరించారు. ఆయన శాలువా కప్పేందుకు ప్రయత్నించగా బాలకృష్ణ మోకాళ్లపై కూర్చుని దాన్ని స్వీకరించారు. రామాంజనేయులు యోగక్షేమాలు అడిగి తెలుసుకుని.. జీవనాదారం ఎలా అని అడిగి.. పింఛన్ రూ. 3వేలు సరిపోతుందా అని ఆరా తీశారు.టీడీపీ కోసం ఫుల్ టైమ్ వర్కర్‌గా పనిచేస్తున్నానని.. తనకు ఏదైనా న్యాయ చేయమని బాలయ్యను వేడుకున్నారు దివ్యాంగుడైన రామాంజనేయ నాయుడు. కచ్చితంగా పార్టీకోసం చేసిన కష్టాన్ని గుర్తించి తగిన న్యాయం చేస్తానని వికలాంగుడికి బాలయ్య హామీ ఇచ్చారు. అభిమానులు జై బాలయ్యా అంటూ నినాదాలతో హోరెత్తించారు.
మరోవైపు బాలయ్య నేటి నుంచి హిందూపురం టౌన్, రూరల్ మండలాల్లో సమస్యలు, కార్యకర్తలు, నాయకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పార్టీ పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలపై మూడు రోజులు సమీక్షలు నిర్వహించనున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయటంలో భాగంగా ఇప్పటికే చిలమత్తూరు, లేపాక్షి మండలాల కార్యకర్తలు, నాయకులతో ఎమ్మెల్యే మాట్లాడతారు. సోమవారం పట్టణ సమీపంలోని జేవీఎస్ ఫంక్షన్‌హాల్‌లో గ్రామీణ మండలానికి చెందిన పార్టీ శ్రేణులతో పంచాయతీల వారీగా సమీక్ష నిర్వహించనున్నారు. 9, 10 తేదీల్లో పట్టణంలోని వార్డుల వారీగా సమీక్ష చేస్తారు.ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదివారం సాయంత్రం తన నివాస గృహంలో పట్టణానికి చెందిన కౌన్సిలర్లు సమస్యలపై చర్చించారు.