తెలంగాణ ముఖ్యాంశాలు

ఒకేసారి డబుల్‌ డిగ్రీ

ఇక నుంచి బీటెక్‌ విద్యార్థులు ఏకకాలంలో రెండు డిగ్రీలు పూర్తిచేయవచ్చు. సీటు వచ్చిన బ్రాంచిలో మేజర్‌ డిగ్రీతోపాటు నచ్చిన కోర్సులో మైనర్‌ డిగ్రీని చదవొచ్చు. ఇలాంటి అవకాశాన్ని జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) కల్పిస్తున్నది. ఈ విద్యాసంవత్సరం నుంచే డ్యూయల్‌ డిగ్రీ విధానాన్ని ప్రవేశపెట్టాలని జేఎన్టీయూ అకడమిక్‌ సెనేట్‌ సమావేశంలో తీర్మానించారు. విధి విధానాల ఖరారుకు నిపుణుల కమిటీని వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఐఐటీల్లో అమల్లో ఉన్న డ్యూయల్‌ డిగ్రీ విధానాన్ని అధ్యయనం చేసిన జేఎన్టీయూ అధికారులు.. ఆ నివేదికను సెనేట్‌ ముందుంచగా ఆమోదం తెలిపింది. 2020-21 విద్యాసంవత్సరంలోనే అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. కానీ, కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో అమలు సాధ్యం కాలేదు.

నచ్చిన సబ్జెక్టు చదువుకోవచ్చు

బీటెక్‌లో సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ కోర్సులను కోర్‌ కోర్సులు గా వ్యవహరిస్తారు. అప్పడెప్పుడో ప్రవేశపెట్టిన ఈ కోర్సుల పట్ల విద్యార్థులు అం తగా ఆసక్తి చూపడంలేదు. ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌గా పేరొందిన కంప్యూటర్‌ సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), మెకట్రానిక్స్‌ వంటి కోర్సుల పట్ల ఆసక్తిచూపుతున్నారు. కోర్‌గ్రూపుల్లో 70 వేలకు పైగా సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా డ్యూయల్‌ డిగ్రీలను ప్రవేశపెట్టాలని జేఎన్టీయూ అధికారులు నిర్ణయించారు. దీంతో తమకు నచ్చిన సబ్జెక్టును విద్యార్థులు చదువుకొనే అవకాశం లభిస్తుంది. ఈ నిర్ణయంతో పరిశ్రమ అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా విద్యార్థులను సన్నద్ధం చేయవచ్చని యూనివర్సిటీ అధికారులు భావిస్తున్నారు. కోర్‌ గ్రూపులకు డిమాండ్‌ తగ్గకుండా చర్యలు తీసుకున్నట్టు అవుతుందని అంచనా వేస్తున్నారు.

ఇలా చదువుకోవచ్చు

  • డ్యూయల్‌ డిగ్రీ విధానంలో విద్యార్థులు కోర్‌ గ్రూపును చదువుతూనే తమకు నచ్చిన కోర్సును మైనర్‌ డిగ్రీగా పూర్తిచేయవచ్చు.
  • సివిల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి కంప్యూటర్‌ సైన్స్‌ కూడా చదువొచ్చు. సీఎస్‌ఈ చదువుతున్న విద్యార్థి మెకానికల్‌ బ్రాంచీలో డిగ్రీని పొందొచ్చు.
  • ఇంజినీరింగ్‌లో మొత్తం 160 క్రెడిట్స్‌ ఉంటే, మైనర్‌ డిగ్రీకి అదనంగా మరో 20 క్రెడిట్స్‌ ఇస్తారు. వీటిని సర్టిఫికెట్లలో పొందుపరుస్తారు.