bjp
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

బీజేపీని గాడిన పెట్టే పనిలో అధిష్టానం

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో అంతర్గత రాజకీయాలను బీజేపీ హైకమాండ్  ఓ కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.   తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చరేడంతో ఆరు పార్లమెంట్, పది అసెంబ్లీ సీట్లలో పోటీకి బీజేపీ నిర్ణయించింది. ఈ క్రమంలో ఏయే సీట్లు, ఎవరు పోటీ చేయాలన్నదానిపై రాష్ట్ర స్థాయిలోనే కేంద్ర ప్రతినిధుల సమక్షంలో కసరత్తు జరిగింది. ఈ కసరత్తులో  బీజేపీకి దశాబ్దాలుగా పని చేస్తున్న సీనియర్లకు పోటీ చేసే అవకాశం లేకుండా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఏపీ బీజేపీ పరిమితమైన సీట్లకు అంగీకరించినప్పటికీ .. జాతీయ స్థాయి ప్రయోజనాల దృష్ట్యా పొత్తునకు అందరూ అంగీకరించారు. అయితే తీసుకుంటున్న సీట్లు ,  పరిగణనలోకి తీసుకుంటున్న అభ్యర్థుల పేర్లను చూసిన తర్వాత పార్టీకి జరుగుతున్న నష్టంపై సీనియర్ నేతలు మండిపడ్డారు.  ఇదే విషయాలను స్పష్టం చేస్తూ హైకమాండ్ కు లేఖ రాశారు. ఉద్దేశపూర్వకంగా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే అవకాశాలు కల్పించేలా చేస్తున్నారని .. సీనియర్లను పక్కన పెడుతున్నారని  హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు.

అంతే కాదు ఓడిపోయే సీట్లను టీడీపీ అంటగడుతూంటే..  అభ్యంతరం  వ్యక్తం చేయకుండా వాటిని ఓకే చేస్తున్నారని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. లేఖలో బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్‌ పాకా వెంకట సత్యనారాయణ, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్‌. దయాకర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణ రాజు, రాష్ట్ర కార్యదర్శి కె. సురేంద్రమోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ, బీజేపీ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యురాలు కె. శాంతారెడ్డి, బీజేపీ సీనియర్‌ నేత జూపూడి రంగరాజు,  జాతీయ మహిళా విభాగం నాయకురాలు మాలతీరాణి ఆ లేఖలో సంతకాలు చేశారు.  సీనియర్ల లేఖను పరిగణనలోకితీసుకున్న హైకమండ్  వెంటనే పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు  పురందేశ్వరిని ఢిల్లీకి పిలిపించారు.రాష్ట్ర స్థాయిలో సీట్ల ఎంపిక, అభ్యర్థుల ఖరారుపై సీనియర్ నేతల అసంతృప్తి, ఏ మాత్రం పార్టీకి ఉపయోగకరం కాని విషయాలను సీనియర్లు రాసిన లేఖతో హైకమాండ్ ఏకీభవించింది. అందుకే… సీట్ల ఎంపిక, అభ్యర్థుల కసరత్తును  ఢిల్లీలో మళ్లీ ప్రారంభించింది.

ఈ సందర్భంగా గతంలో సీట్లు ఖరారయ్యాయి అని సంబరాలు చేసుకున్న వారికి షాక్ తగిలినట్లయింది. పార్టీని నమ్ముకున్న సీనియర్లు అందర్నీ పక్కన పెట్టేసి.. కొత్తగా వచ్చిన వారికి మాత్రమే అవకాశాలు  కల్పించడం సమంజసం కాదని.. సీనియర్లకు కూడా సగం సీట్లలో పోటీ చేసే అవకాశం కల్పించాలని హైకమాండ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ దిశగానే కసరత్తు కొనసాగుతోందని చెబుతున్నారు. హైకమాండ్ జోక్యంతో ..  ఈ ఎన్నికల్లో సీటు రాదు అనుకుంటున్న పలువురు సీనియర్లకు ఆశలు చిగురించాయి. నిజానికి గత ఐదేళ్లుగా బీజేపీలో కీలక పదవుల్లో ఉండి.. ప్రజల్లో పని చేసి.. పార్టీ ఇచ్చిన ప నుల్ని సమర్థంగా  నిర్వహించిన యువనేతలు, సీనియర్ నేతలకు ఖచ్చితంగా అవకాశం రావాల్సి  ఉంది.  కానీ ఈ సీనియర్లపై రాజకీయ పరమైన ప్రచారాలు చేసి.. వారికి సీటు రాకుండా చేయడానికి  కొంత మంది ప్రయత్నించడం .. వారి మాటే చెల్లుబాటయ్యే పరిస్థితి ఏర్పడటంతో సీనియర్లు నిరాశపడ్డారు. పార్టీ కోసం త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు కానీ.. తమ త్యాగం..  బీజేపీకి నష్టం చేస్తుందని తెలియడంతో వెంటనే రంగంలోకి దిగారు. హైకమాండ్ కు లేఖ ద్వారా తెలిపారు.

హైకమాండ్ కూడా వెంటనే స్పందించి.. పరిస్థితుల్ని దారిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. పార్టీకి దశాబ్దాలుగా కష్టపడుతున్న సీనియర్లకు.. కొత్తగా పార్టీలో చేరిన వారికి సమతూకంలో అవకాశాలు కల్పిస్తూ…  ఆరు ఎంపీలు, పది అసెంబ్లీ సీట్లు, అభ్యర్థుల జాబితాను ఒకటి , రెండు రోజుల్లో  బీజేపీ  హైకమాండ్ విడుదల చేసే అవకాశం ఉంది.