water
తెలంగాణ ముఖ్యాంశాలు

హైదరాబాద్ కు పొంచి ఉన్న నీటి కష్టాలు

ఎండలు దంచి కొడుతున్నాయి. వర్షాలకు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పినప్పటికీ.. అవి ఏదో ఒకచోటకు మాత్రమే పరిమితమవుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో నీటి అవసరాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాదు లాంటి నగరంలో తాగునీటికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. జంట జలాశయాలు ఉన్నప్పటికీ.. అందులో సరిపడా నీరు లేదు. నాగార్జునసాగర్ ఇప్పటికే డెడ్ స్టోరేజ్ కి చేరుకుంది. గోదావరి లోనూ నీరు అంతంతమాత్రంగానే ఉండడంతో అవి భవిష్యత్తు అవసరాలకు సరిపోని పరిస్థితి. వర్షాలు కురిసే వరకు ఈ తాగునీటికి ఇబ్బంది తప్పదు. దీంతో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.వేసవికాలం ముందు ఉన్నందున హైదరాబాద్ నగర ప్రజలు తాగునీటిని ఇతర అవసరాల కోసం వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డు ప్రకటించింది. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో తాగునీటికి డిమాండ్ ఏర్పడుతున్నదని, మార్చి లోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలలో వాటర్ డిమాండ్ పీక్ స్టేజ్ కి వెళ్తుందని హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ వాటర్ సప్లై బోర్డు అధికారులు చెబుతున్నారు.

అలాంటప్పుడు అందరికీ తాగునీరు సరఫరా చేయాలంటే వృధాను అరికట్టాలని, ఇతర వాణిజ్య అవసరాలకు తాగునీటిని వినియోగించడం నిలుపుదల చేయాలని నిర్ణయించామని వారి పేర్కొన్నారు. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాలను గండిపేట, ఉస్మాన్ సాగర్, నాగార్జునసాగర్, గోదావరి జిల్లాలో తీరుస్తున్నాయి. గత ఏడాది ఆశించినత స్థాయిలో వర్షాలు కురువకపోవడంతో జలాశయాలలో అంతర్దమాత్రంగానే నీరు నిల్వ ఉంది. ఈ నీటిని పొదుపుగా వాడేలా ప్రజలకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.ఇక ప్రస్తుతం మన పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తీవ్ర రూపు దాల్చింది. బెంగళూరు నగరంలో క్యాన్ నీటి కోసం ప్రజలు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. ఒకానొక దశలో బెంగళూరులో నెలకొన్న తాగునీటి ఎద్దడి వల్ల ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించాలా? వద్దా? అనే సందిగ్ధం ఏర్పడింది.

చివరికి బెంగళూరు వాటర్ సప్లై బోర్డు మురుగు నీటి నుంచి శుద్ధి చేసిన జలాన్ని సప్లై చేస్తామని చెప్పడంతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు మార్గం సుగమమయింది. కాకపోతే బెంగళూరులో నెలకొన్న తాగునీటి ఎద్దడి నేపథ్యంలో అక్కడి పురపాలక అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. తాగునీటిని కమర్షియల్ అవసరాలకు వాడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చివరికి వాహనాల వాషింగ్ సెంటర్ లపై కూడా నిఘా పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో తాగునీటితో వాహనాలను కడగొద్దని, అలా చేస్తే భారీగా అపరాధ రుసుం విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. బెంగళూరు లాగానే హైదరాబాద్ కూడా కాస్మో పాలిటన్ సిటీ కావడంతో ముందస్తు జాగ్రత్త చర్యగా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డు అధికారులు పలు నిర్ణయాలను తీసుకున్నారు. ఇందులో భాగం గానే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు.