బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్టీ నాయకులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 80 నుండి 100 శాతం ఓటింగ్ నమోదయ్యేలా క్రుషి చేసిన వారికి రూ.10 వేల ప్రోత్సాహక నగదు అందజేస్తామన్నారు. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎస్టీ మోర్చా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ చాలా కష్టపడుతోంది. అందులో భాగంగా ఎన్నికల సంఘానికి పూర్తిగా సహకరించాలే. స్వచ్ఛంద సంస్థలతోపాటు అన్ని రాజకీయ పార్టీలు భాగస్వాములు కావాలి. తద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుందాం. అందులో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్ని పోలింగ్ బూతుల్లో 80 నుండి 100 శాతం ఓటింగ్ నమోదయ్యేలా క్రుషి చేస్తారో, వారందరికీ రూ.10 వేల చొప్పున ప్రోత్సాహక బహుమతి అందిస్తాం.’’అని తెలిపారు. ఎన్నికల్లో ఎవరైనా సరే తమకు నచ్చినట్లుగా ఏ పార్టీకైనా ఓటేసుకోవచ్చని, అందులో అభ్యంతరం లేదని చెప్పిన బండి సంజయ్ ప్రతి ఒక్కరికీ ఈ విషయంలో అవగాహన పెంపొందించి ఓటింగ్ శాతం నమోదయ్యేలా క్రుషి చేయాలని కోరారు.