ఆంధ్రప్రదేశ్ రాజకీయం

డ్వాక్రా, రైతు రుణమాఫీలు చేశారా

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశానని చెప్పుకునే చంద్రబాబు రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేశారా? అని ఏపీ సీఎం జగన్ అన్నారు. కైకలూరులో నిర్వహించిన ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు.
మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చామని, జగన్ కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని ఆయన అన్నారు. ఐదేళ్లు లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించామన్నారు. ‘రైతులకు 9 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాం. రూ. 2 లక్షల 70 వేల కోట్లను డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు అందించాం. ఇంటి వద్దకే పౌరసేవలు, పెన్షన్ వస్తుంది. రాబోయే ఐదేళ్లలో ఇంటింటా అభివృద్ధి’ అని ఆయన అన్నారు. సాధ్యంకాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారని, పొరపాటున చంద్రబాబును నమ్మడం అంటే.. కొండ చిలువ నోట్లో తల పెట్టడమే అని ఆయన అన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన ఒక్క మంచి పనైనా గుర్తొస్తుందా..? అని ఎద్దేవా చేశారు. రాబోయే ఐదేళ్ల ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించేవే ఈ ఎన్నికలు అని ఆయన అన్నారు.గత ఐదేళ్ల కాలంలో విప్లవాత్మక పాలన అందించా మన్నారు. ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు మార్చామన్నారు. నాడు నేడు పథకంతో ప్రభుత్వ స్కూళ్లన్నిటినీ అభివృద్ధి చేశామన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలిచ్చామన్నారు.

అది కూడా మహిళల పేరు మీద ఆ పట్టాలిచ్చామని ఆయన చెప్పారు. రైతు బీమా, రైతు భరోసా వంటి పథకాలను రైతుల కోసం అమలు చేస్తున్నామన్నారు. 9 గంటల పగటి పూట విద్యుత్ ను సరఫరా చేస్తున్నా మన్నారు. స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు పథకాలు తీసుకొచ్చామని ఆయన చెప్పారు.ఈ ఎన్నికలు పేదలు, పెత్తందారుల మధ్య జరుగుతున్న ఎన్నికలని ఆయన అన్నారు. వృద్ధుల పెన్షన్ పంపిణీ విషయంలో చంద్రబాబు అడ్డుపడుతున్నారన్నారు. అదేవిధంగా మహిళలకు సంబంధించిన పథకాలలో కూడా ఢిల్లీ వాళ్లతో కలిసి చంద్రబాబు కుట్రలు పన్నారన్నారు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో చంద్రబాబు, కూటమి నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, నంద్యాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు.. సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో పైరయ్యారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కూడా ఆయన జగన్ పై ఫైరయ్యారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని రద్దు చేస్తామన్నారు