జాతీయం ముఖ్యాంశాలు

26న త‌న కార్యాచ‌ర‌ణ‌ ప్ర‌క‌టిస్తాన‌న్న సీఎం

బీజేపీని మ‌రోసారి అధికారంలోకి తీసుకురావ‌డ‌మే నా ల‌క్ష్యం: య‌డియూర‌ప్ప

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప రాజీనామా చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌పై ప‌లు ఆరోప‌ణ‌లు రావ‌డంతో పదవి నుంచి తప్పించాలని బీజేపీ అధిష్ఠానం కూడా నిర్ణయానికి వచ్చినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల ఢిల్లీకి వెళ్లిన య‌డియూర‌ప్ప బీజేపీ అధిష్ఠానాన్ని క‌లిసి చ‌ర్చలు జ‌రిపారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఈ రోజు కీల‌క వ్యాఖ్యలు చేశారు. త‌న భ‌విష్య‌త్తుపై ఈ నెల 25న బీజేపీ అధిష్ఠానం నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని చెప్పారు.

తాను అధిష్ఠానం నిర్ణ‌యాన్ని అనుస‌రించి న‌డుచుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. అధిష్ఠానం నిర్ణ‌యం ఎలా ఉన్న‌ప్ప‌టికీ తాను పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తాన‌ని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని మ‌రోసారి అధికారంలోకి తీసుకురావ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని తెలిపారు. ఈ నెల 26న త‌న కార్యాచ‌ర‌ణ‌ ప్ర‌క‌టిస్తాన‌ని అన్నారు. ఈ నెల‌ 26 నాటికి నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉందని ఇటీవ‌ల ప్రచారం జ‌రిగింది. క‌ర్ణాట‌క‌లో య‌డియూర‌ప్ప స‌ర్కారుకు ఈ నెల 26తో రెండేళ్లు పూర్త‌వుతాయి.