తెలంగాణ

సెంటిమంటలో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలువాస్తు భయంతో దూరం... దూరం

నిజామాబాద్, జూలై 1: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాల్లో ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తీరు చర్చనీయాంశమవుతోంది. ఎమ్మెల్యేలుగా గెలిచి సుమారు 8 నెలలు కావస్తున్నా.. ఆ ముగ్గురు తమ కార్యాలయాల్లోకి అడుగుపెట్టకపోవడమే పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. సొంత నియోజకవర్గాల్లో ఉంటున్న ఎమ్మెల్యేలు… ప్రభుత్వం లక్షల రూపాయలతో నిర్మించిన కార్యాలయాలకు రాకపోవడమేంటని… ఆరా తీస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఎన్నికల్లో వీరోచితంగా పోరాడిన సదరు నేతలు… వాస్తు భయంతోనే తమ కార్యాలయాల్లోకి అడుగుపెట్టలేదట.. ఇలా వాస్తు అంటే భయపడిపోతున్న ఆ ముగ్గురూ కాంగ్రెస్‌ వారే… సీనియర్‌ నేత బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డితోపాటు నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌లకు వాస్త భయం పట్టుకుందనే సమాచారం హాట్‌టాపిక్‌గా మారింది.ప్రజలకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గత సర్కార్‌లో నియోజకవర్గ కేంద్రాల్లో క్యాంపు కార్యాలయాలను నిర్మించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక హంగులతో భవనాలు నిర్మించగా, చాలా మంది ఆయా కార్యాలయాల నుంచి సేవలు అందిస్తున్నారు. ఐతే కొందరు మాత్రం వాస్తు భయంతో అటువైపు కూడా చూడటం లేదు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, మదన్‌మోహన్‌ సైతం ఇదే భయంతో క్యాంపు కార్యాలయాలకు వెళ్లడం లేదని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత భవనాల్లో పనిచేసిన బీఆర్‌ఎస్‌ నేతలు తమ చేతిలో ఓడిపోడానికి… క్యాంపు కార్యాలయాల్లో వాస్తు దోషాలే కారణమని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భావిస్తున్నారట గత ఏడాది వరకు కళకళలాడిన క్యాంపు కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. ఎనిమిది నెలలుగా ఎమ్మెల్యేలతోపాటు ఏ ఒక్కరూ అటువైపు రాకపోవడంతో భవనాలు నిరూపయోగంగా మారిపోయాయి. ఇక క్యాంపు కార్యాలయాలను వినియోగించని ఎమ్మెల్యేలు ప్రత్యామ్నాయంగా సొంతంగా కార్యాలయాలు ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. ఐతే ఆధునిక కాలంలో బాగా చదువుకున్న వారు… రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన నేతలు వాస్తు అంటూ ఖరీదైన.. ఆధునిక వసతులతో కూడిన భవనాలను వృధాగా వదిలేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయిఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ బాగా చదువుకున్న వారు. విదేశాల్లో వ్యాపారం చేసి వచ్చిన వారు. అలాంటి ఆయన సెంటిమెంట్‌కు ప్రాధాన్యం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలిచిన మదన్‌మోహన్‌కు వాస్తు భయం ఉందనే ప్రచారంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేగా గెలిచిన 8 నెలల్లో ఒక్కసారి కూడా తన క్యాంప్ కార్యాలయంలో అడుగు పెట్టలేదు మదన్‌మోహన్‌. దీంతో క్యాంప్ కార్యాలయాన్ని ఈ మధ్యనే విద్యుత్ శాఖ డీఈ ఆఫీస్‌కు మార్చారని చెబుతున్నారు.ఇక బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి తీరు కూడా చర్చనీయాంశమవుతోంది. ఉమ్మడి జిల్లాలోనే సీనియర్‌ కాంగ్రెస్‌ నేతగా సుదర్శన్‌రెడ్డికి మంచి గుర్తింపు ఉంది. పదేళ్ల క్రితం వరకు జిల్లాలో చక్రం తిప్పిన సుదర్శన్‌రెడ్డి మంత్రిగానూ పనిచేశారు. అలాంటి నేత కూడా ఇప్పుడు వాస్తు పేరిట కార్యాలయానికి దూరంగా ఉంటుండటమే చర్చకు తావిస్తోంది. ప్రస్తుతం జిల్లా నుంచి మంత్రివర్గం రేసులో ఉన్న సుదర్శన్‌రెడ్డి…. ఎమ్మెల్యేల కోసం లక్షలు వెచ్చించి నిర్మించిన భవనాలను వృథాగా వదిలేయడంపై విమర్శలు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సైతం క్యాంపు కార్యాలయం వైపు కన్నెత్తి చూడటం లేదంటున్నారు.మొత్తానికి ముగ్గురు ఎమ్మెల్యేల తీరుపైన పొలిటికల్‌ సర్కిల్స్‌గా పెద్ద చర్చే జరుగుతోంది. ఎవరి సెంటిమెంట్‌ వారికి ఉంటుంది… క్యాంపు కార్యాలయాలకు రాకపోయినా, ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు కదా? అంటూ కాంగ్రెస్‌ నేతలు ఎమ్మెల్యేలను వెనకేసుకొస్తుంటే… బీఆర్‌ఎస్‌ మాత్రం విలువైన భవనాలను గాలికొదిలేయడంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.