ఆంధ్రప్రదేశ్

అయోమయంలో వలంటీర్లు...

విజయవాడ, జూలై 29: ఏపీలో వలంటీర్లు ఉన్నారా? లేరా? మూడు నెలలుగా విధులకు దూరంగా ఉన్న వలంటీర్లను మళ్లీ వినియోగించుకుంటారా? అందరికీ ఉద్వాసన చెప్పి కొత్తవారిని నియమిస్తారా? లేక ఉన్నవారిని కొనసాగించి.. ఖాళీల్లో కొత్తవారిని నియమిస్తారా? అసలు వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది… త్వరలో వలంటీర్ల వ్యవస్థపై నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి వీరాంజనేయస్వామి ప్రకటన వలంటీర్లలో కొత్త ఆశలు రేపుతోందా? వలంటీర్లపై ప్రభుత్వం తీసుకోబోతోన్న నిర్ణయమేంటి?ఏపీలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన వలంటీర్ల వ్యవస్థను కొనసాగుతుందా? లేదా? అనేదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. వలంటీర్ల వ్యవస్థపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సంబంధిత శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి చేసిన ప్రకటన… వలంటీర్లలో కొత్త ఆశలు చిగురించేలా చేసిందంటున్నారు.వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల పంపిణీ కంటూ వలంటీర్లను నియమించారు. నెలకు 5 వేల రూపాయల గౌరవ వేతనం అందుకునే వలంటీర్లలో ఎక్కువ మంది వైసీపీ కార్యకర్తలే ఉన్నారని గతంలో టీడీపీ ఆరోపించింది. ఎన్నికల సమయంలో వారిని విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్‌ను కోరింది.టీడీపీ వినతి మేరకు ఎన్నికల కమిషన్‌ వలంటీర్లను ఎన్నికల విధులతో సహా సంక్షేమ పథకాల పంపిణీకి దూరంగా ఉంచింది. అయితే ఎన్నికలు జరిగి రెండు నెలలు పూర్తయినా వలంటీర్లకు ఎలాంటి విధులు అప్పగించలేదు ప్రభుత్వం. దీంతో వలంటీర్‌ వ్యవస్థ కొనసాగుతుందా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఐతే తాజాగా మంత్రి చేసిన ప్రకటనతో మళ్లీ వలంటీర్లలో ఆశలు చిగురిస్తున్నాయంటున్నారు.ఎన్నికల ముందు రెండు నెలలు… ఎన్నికల తర్వాత రెండు నెలలు… వలంటీర్లకు ఎలాంటి విధులు అప్పగించలేదు. అలా అని వారికి వేతనాలు కూడా ఇవ్వలేదు. చివరగా మే నెల వేతనం అందుకున్న వలంటీర్లు జూన్‌, జూలై నెలల్లో ఒక్కపైసా కూడా వేతనంగా పొందలేదు. ఇక ఆగస్టులో వారికి వేతనాలు ఇస్తారో? లేదో? తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షా 67 వేల మంది వలంటీర్లు ఉన్నట్లు సుమారుగా అంచనా.. మొత్తం రెండు లక్షల 65 వేల మంది వలంటీర్లకు లక్ష మందికిపైగా ఎన్నికలకు ముందు రాజీనామా చేశారు.ఐతే ఎన్నికల్లో ఓటర్లను వలంటీర్లు ప్రభావితం చేస్తారనే ఆలోచనతో ఇటు వైసీపీ.. అటు టీడీపీ కూడా వలంటీర్లను మచ్చిక చేసుకునేలా ప్రయత్నాలు చేశాయి. వలంటీర్లను ఎన్నికలకు విధులకు దూరం చేయడంతో రాజీనామా చేయాలని.. రాజీనామా చేసిన వారికి తాము వేతనాలిస్తామంటూ వైసీపీ నేతలు హామీ ఇచ్చారు. వీరి మాటలు విని కొందరు రాజీనామా చేయగా, తాము అధికారంలోకి వస్తే పది వేల రూపాయల వేతనం చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.ఇక ఎన్నికల తర్వాత వలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. ఎప్పటిలాగే రోజూ గ్రామ, వార్డు సచివాలయాలకు వస్తున్న వలంటీర్లు కాలక్షేపం చేస్తూ వెళ్లిపోతున్నారు. తాము విధుల్లో ఉన్నట్లా? లేదా? అన్నది వారికి క్లారిటీ లేదు. అధికారులు కూడా ఎలాంటి పనిచెప్పడం లేదు. దీంతో నెలన్నరగా వలంటీర్ల వ్యవస్థపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.పింఛన్ల బట్వాడాలో కీలకంగా పనిచేసే వలంటీర్లు లేకుండానే గత నెల పింఛన్లను ఒక్కరోజులోనే పంపిణీ చేసింది ప్రభుత్వం. దీంతో వలంటీర్లు అవసరం ఏముందనే ప్రశ్న తలెత్తింది. ఐతే కార్యకర్తల పునరావాసానికి ఈ వ్యవస్థను వాడుకోవాలని కూటమి పార్టీల్లోని కొందరు నేతలు సూచించడంతో తాజాగా వలంటీర్లను కొనసాగించే విషయమై ప్రభుత్వం సానుకూలంగా ఉందంటున్నారు.ఐతే గత ప్రభుత్వంలో ఉన్నవారిని కూడా కొనసాగిస్తారా? లేక కొత్తగా రిక్రూట్‌మెంట్‌ చేపట్టి తమ వారిని నియమించుకుంటారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి గత ప్రభుత్వంలో నియమితులైన వలంటీర్లలో కొందరిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అప్పటి ప్రభుత్వం కూడా వలంటీర్లు తమ కార్యకర్తలే అంటూ చెప్పుకోడానికి ప్రాధాన్యమిచ్చింది.వలంటీర్ల పనితీరుపై టీడీపీతోపాటు జనసేన, బీజేపీ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఐతే కేవలం ఐదు వేల రూపాయల వేతనం కోసం పనిచేసిన వారిపై కక్ష కట్టినట్లు వ్యవహరించడం సరికాదనే అభిప్రాయం ఇప్పుడు ప్రభుత్వ పెద్దల్లో ఉందంటున్నారు. వివాదాస్పద వైఖరి ఉన్నవారు ఇప్పటికే తప్పుకున్నారని… ప్రస్తుతం ఏ పార్టీతో సంబంధం లేని వలంటీర్లు మాత్రమే ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారని అంటున్నారు.ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వానికి పార్టీకి మధ్య వారధిగా పనిచేసే వలంటీర్‌ వ్యవస్థను సక్రమంగా వాడుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఐతే ప్రస్తుతం 50 ఇళ్లకు ఓ వలంటీర్ ఉండగా, వీరి పరిధిని పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు చెబుతున్నారు. ప్రభుత్వ ఆలోచన ప్రకారం ఇకపై ప్రతి వంద ఇళ్లకు ఓ వలంటీర్‌ ఉండే అవకాశం ఉందంటున్నారు.ఇదే నిజమైతే ప్రస్తుతం ఉన్న వలంటీర్లే సరిపోయే అవకాశం ఉంటుంది. కొత్తగా ఎవరినీ నియమించాల్సిన అవసరం ఉండదు. ఐతే ఇలా ఉన్నవారిలో వైసీపీ అనుకూల వలంటీర్లకు ఉద్వాసన చెప్పడం ఎలా అన్నవిషయమై ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. వైసీపీ అనుకూల వలంటీర్ల స్థానంలో తమవారిని నియమించడంపై క్లారిటీ వచ్చాకే ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. అంటే వలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వ వైఖరి స్పష్టమవ్వాలంటే మరికొన్నాళ్లు పట్టే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి మంత్రి వ్యాఖ్యలు.. ప్రభుత్వ ఆలోచన పరిశీలిస్తే వలంటీర్లు కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.