వెనిజులా: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో 51.2% ఓట్లతో మూడవసారి గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 25 ఏళ్ల సోషలిస్టు పాలనను కూలదోసేందుకు పశ్చిమ దేశాలు పన్నిన అనేక కుట్రలు, కుతంత్రాలను ఇక్కడ ప్రజలు పారనివ్వలేదు. అధ్యక్షుడు మదురోకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాల బహుళజాతి, కార్పొరేట్ ప్రచార బాకాలు అసత్య ప్రచారాన్ని అదే పనిగా సాగించినా దేశ ప్రజలు మదురోకు మరోసారి పట్టం కట్టారు. ఈ ఎన్నికల్లో పది మంది దాకా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నప్పటికీ ప్రధాన పోటీ అధ్యక్షుడు మదురో, యూనిటరీ డెమొక్రటిక్ ప్లాట్‌ఫామ్‌కు చెందిన ఎడ్మండో గొంజాలెజ్ మధ్యే సాగింది. బూజుపట్టిన నిరంకుశ కులీన వర్గాల ప్రతినిధి గొంజాలెజ్. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరిగితే గొంజాలెజే గెలుస్తాడని విసృతంగా ప్రచారం చేశారు. కానీ ఎన్నికలు ఎంత పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్నాయో తెలుసుకునేందుకు వెనిజులా ఎన్నికల సంఘం అంతర్జాతీయ పరిశీలకులను ఆహ్వానించి గట్టిదెబ్బకొట్టింది.