ఆంధ్రప్రదేశ్

వచ్చేస్తున్నాయ్... కుంకీ ఏనుగులు

తిరుపతి, ఆగస్టు 14: చిత్తూరు జిల్లా శివారులో   ఆహారం కోసం వచ్చి ఏనుగులు బలి అవుతున్నాయి. అలాగే కష్టపడి పండించిన పంటలను ఏనుగుల నుంచి రక్షించేందుకు రైతులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎప్పుడు వినిపిస్తున్న మాట. ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకు పవన్ కళ్యాణ్ ముందడుగు వేశారు. కుంకీ ఏనుగులను కర్ణాటక నుంచి తెప్పించారు. కుంకీ ఏనుగులు అనేది శిక్షణ పొందిన ఏనుగులను పిలుస్తారు. మనకు కర్నాటక రాష్ట్రం లో ఎక్కువ కుంకీ ఏనుగులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం రెండు కుంకీ ఏనుగులు ఉన్నాయి. కుప్పం నియోజకవర్గం రామకుప్పం పరిధిలోని నెనియాల అడవిలో వీటిని సంరక్షణ జరుగుతుంది. ఈ కుంకీ ఏనుగుల్లో వినాయక అనేది చిత్తూరు జిల్లాలో అడవిలో బంధించి ఏడాది పాటు శిక్షణ పొందిన ఏనుగు… మరొక్కటి జయంత్ తిరమల నుంచి తెచ్చిన ఏనుగు. 2016 నుంచి ఇవి మన రాష్ట్రంలో ఏ ప్రమాదం జరిగిన.. ఎక్కడైన ఏనుగుల దాడులు జరిగినా… ఏనుగులను ప్రమాదం నుండి కాపాడేందుకు.. జనసంచారం లో నుండి అడవిలోకి మళ్లించడానికి లేదా పెట్టుకునేందుకు ఈ కుంకీలు చేస్తున్నాయి.ఉమ్మడి చిత్తూరు జిల్లా అనగానే వన్యప్రాణుల నెలవు. అభయారణ్యాలు ఎక్కువ ఉన్న ఈ జిల్లాలో ఏనుగులు కూడా ఎక్కువే. చిత్తూరు జిల్లాకు తమిళనాడు, కర్నాటక అడవులు ఉండడంతో అన్ని ప్రాంతాల్లో ఏనుగుల కదలికలు ఉంటాయి. కౌండిన్య ఆభయారణ్యం సుమారు 357 చదరపు కిలోమీటర్ల పరిధిలో 88,550 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది గజరాజుల ఆవాసం గా చెప్పొచ్చు. మూడు రాష్ట్రలు కలిగిన కౌండిన్య ఆభయారణ్యం లో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది.  మూడు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు ఇతర రాష్ట్రాల వైపు ఏనుగులను తరిమేస్తున్నారు. దీని ద్వారా అవి ఎటు వెళ్లాలో తెలియకపోవడంతో ఆహారం కనిపించే పంటల వైపు వస్తున్నాయి. అధికారుల ఏనుగుల గణన ప్రకారం చిత్తూరు జిల్లాలో 110 ఏనుగులు, తమిళనాడు 300 ఏనుగులు, కర్నాటక 400 ఏనుగులు ఉన్నాయని అంచనా కు వచ్చారు. ఇవన్ని తమ రాష్ట్రానికి సంబంధించినవి కావు అనేలా మూడు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు వ్యవహరించే తీరు ఏనుగుల దాడులు… రైతులు ప్రాణాలు… పంటలు నష్టపోయేందుకు ప్రధాన కారణం. వీటి కారణంగా పలు సందర్భాల్లో గొడవలు కూడా జరిగాయి. కర్నాటక రాష్ట్ర అటవీ శాఖ అధికారుల వద్ద ఎయిర్ గన్స్ ఉండడం తో వాటిని వల్ల ఏనుగులు బయపడి మన ఏపీలోని చిత్తూరు జిల్లా వైపు ఎక్కువగా సంచరిస్తుంటాయి.అడవిలో ఉండాల్సిన ఏనుగులు జీన సంచారం ఉన్న ప్రాంతానికి ఎందుకు వేస్తున్నాయి అనేది అసలు సమస్య. చిత్తూరు జిల్లా సరిహద్దు అయిన పలమనేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలోని రామకుప్పం, శాంతిపురం మండలాల్లో ఏనుగుల కదలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పంటలు వేసి అవి చేతికి అందే సమయానికి ఏనుగులు వచ్చి నాశనం చేస్తున్నాయి. కొందరు రైతులు ఏనుగుల భారీ నుంచి తమ పంటలను కాపాడుకునేందుకు విద్యుత్ షాక్ పెట్టి వాటి మరణాలకు కారణమవుతున్నారు.   అసలు ఏనుగులు ఎప్పుడు గుంపుగా ఉండేందుకు ఇష్టపడుతాయి. ఎక్కడ తిరిగినా అవి కలిసి తిరుగుతాయి. ఇందులోని ఓ మగ ఏనుగు ముందుండి మందను నడిపిస్తుంది. అడవిలో నీటి సమస్య, అవి తినే ఆహారం లేకపోవడం, చెట్టు నరికేసి వాటి పరిసరాల్లో నిర్మాణాలు చేపట్టడం చేస్తుంటారు. వీటి కారణంగా అడవిలో ఉండాల్సిన ఏనుగులు పంటల పై పడుతున్నాయి. పంటలు పైకి వస్తే వాటిని మళ్లించేందుకు రైతులు, అటవీ శాఖ అధికారులు పలు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి గుంపు నుంచి విడిపోయిన ఒంటరి ఏనుగే ప్రమాదాలకు కారణం. అవి గుంపు నుంచి బయటకు వస్తే ఎలా వెళ్లాలి… ఎక్కడ వెళ్లాలో తెలియక.. రైతులు పెట్టే శబ్దాలకు అవి భయపడి ప్రజలు పైకి దాడులు చేస్తాయి.  పలమనేరు ప్రాంతంలో 4610 హెక్టార్ల అడవి ఉండగా అందులో 3426 హెక్టార్ల మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. సహజంగా అడవిలో లభించే ఆహారం కంటే బయట పంటైన చెరుకు, అరటి, వరి, మామిడి తదితర పంటలు పై ఆసక్తితో అటవి ప్రాంతం నుంచి బయటకు వస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. దీని ద్వారా వందల హెక్టార్ల పంట నష్టం… 22 మందికి పైగా రైతులు… 8 వరకు ఏనుగులు చనిపోయినట్లు తెలుస్తుంది.పలమనేరు ను ఇప్పటికే ఏనుగుల హబ్  గా 2016లో ప్రకటించింది.  మాజీ మంత్రి,  పలమనేరు ప్రస్తుత ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గతంలో పలమనేరు నుంచి 10 కిలో మీటర్లు దూరం లో ఉన్న అటవీ శాఖ భూమిలో గజరామమం అని ఏర్పాటు చేసి అభివృద్ధి చేసారు. గత ఐదు సంవత్సరాలుగా ఆ ప్రాంతాన్ని ఎవరు పట్టించుకోలేదు. ప్రస్తుతం అటవీశాఖ ఆ భూమి గురించి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ మరో ఐదు గజరాజులను పెట్టేందుకు పనులు ప్రారంభించారు. మిగిలిన వాటిని ఎక్కడ పెట్టాలనే దానిపై చర్చ నడుస్తోంది. గజరామమం ప్రాంతంలో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, అందుకు సంబంధించిన నిధులు విడుదల చేయనున్నారు. పవన్ కళ్యాణ్ నిర్ణయం పట్ల గజరాజుల దాడులను ఎదుర్కొంటున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.