ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతోంది. ప్రభుత్వం ఏర్పాటు వంద రోజులు దాటుతోంది. గత వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను అధిగమిస్తూ.. సరికొత్త పాలనతో ముందుకు సాగుతున్నారు చంద్రబాబు. ఈ క్రమంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారు. కష్టాల నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు అంటే ఒక విజినరీ..చంద్రబాబు అంటే అభివృద్ధికి చిరునామా..చంద్రబాబు అంటే ఒక పక్కా ప్రణాళిక..ఇలా చంద్రబాబు గురించి చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. ఒక రాజకీయ పార్టీ నాయకుడికి అనేక పార్శాలు ఉంటాయి. చంద్రబాబులో సైతం అవి వెతకవచ్చు. కానీ ఆయన మాత్రం ఒక పాలనా దక్షుడు. ఈ విషయాన్ని ప్రత్యర్థులే ఒప్పుకుంటారు. 24 గంటల్లో 16 గంటలపాటు ప్రజల కోసమే పనిచేసే నాయకుడు చంద్రబాబు. తాను పనిచేయడమే కాదు అందరూ పని చేస్తేన..మంచి ఫలితాలు వస్తాయని భావిస్తారు.ఈ క్రమంలోనే ఆయనకు వ్యతిరేకించిన వారు ఎక్కువయ్యారు. ఆ విషయాన్ని పక్కన పెడితే..ప్రజలు ఎంతో నమ్మకంతో ఈసారి ఆయనను గెలిపించారు.
ఈ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఆయన పాలన వంద రోజులు దాటింది. నాలుగు నెలలకు సమీపిస్తోంది. అందుకే చంద్రబాబు నవ పాలన ఎలా ఉందన్న విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. నాలుగు మాసాల్లో చంద్రబాబు తీసుకున్న కీలక నిర్ణయాల పైన చర్చ సాగుతోంది. పనిచేయాలంటే యంత్రాంగం ముఖ్యం. అందుకే పాలన యంత్రాంగం పై ఫోకస్ పెట్టారు చంద్రబాబు. ఐఏఎస్ ల నుంచి ఐపీఎస్ ల వరకు అందర్నీ మార్చేశారు. కూటమి సర్కార్ లక్ష్యాలను సాధించే వారికి, మనసెరిగి పనిచేసే వారికి పెద్ద పీట వేశారు. అదే సమయంలో గత వైసిపి సర్కారు ప్రాధాన్యాలను వదిలిపెట్టని వారిని దూరంగా ఉంచారు. తద్వారా పాలన యంత్రాంగం పై చంద్రబాబు తనదైన ముద్ర వేశారు. సంక్షేమంతో పాటు అభివృద్ధినిసమ ప్రాధాన్యమిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు సమీకరించడం,యువతకు అవకాశాలు కల్పించడం విషయంలో దూకుడుగా ముందడుగు వేస్తున్నారు. వైసిపి దెబ్బతో దూరమైన కంపెనీలను తిరిగి తెచ్చేందుకు శతభితాల ప్రయత్నిస్తున్నారు. ఐదేళ్ల వైసిపి పాలనలో రాజధానిలేని రాష్ట్రంగా మిగిలింది ఏపీ.అందుకే అమరావతి రాజధాని నిర్మాణంపై దృష్టి పెట్టారు చంద్రబాబు.
కేంద్రం నుంచి నిధులు పొందగలిగారు.అదే సమయంలో వైసీపీ విధానాలతో అమరావతి నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలను, సంస్థలను తిరిగి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇందులో చాలావరకు సక్సెస్ అయ్యారు కూడా. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కంపెనీలను ఆహ్వానిస్తున్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టారు. ఒకవైపు ప్రభుత్వ కొలువులు, మరోవైపు ప్రైవేటు ఉద్యోగాలు పొందే విధంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు.సంక్షేమంలో కూడా కీలక అడుగులు వేయగలిగారు.పింఛన్ల పెంపుతో పాటు బకాయిలను సైతం అందించగలిగారు. ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయులకు జీతాల సమస్య లేకుండా చేయగలిగారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు.15 రూపాయలకే పేదవాడి ఆహార అవసరాన్ని తీర్చగలిగారు.
దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్లు అందించేందుకు సిద్ధపడుతున్నారు.ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై సన్నాహాలు చేస్తున్నారు.రైతులకు సాగు పెట్టుబడి,పిల్లలు చదువుకునేందుకు ప్రోత్సాహం వంటి మంచి విషయాల్లో సైతం సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు.మొత్తంగా నాలుగు మాసాల నవ పాలనలో చంద్రబాబుకు మంచి మార్కులు పడుతున్నాయి.