ప్రతిపక్షాలు పార్లమెంటులో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తుండడంతో షెడ్యూల్ కన్నా ముందే లోక్‌సభ నిరవధిక వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో లోక్‌సభ సమావేశాల నిర్వహణపై స్పీకర్ ఓం బిర్లా వివరాలు తెలిపారు. ఆశించిన స్థాయిలో సభ జరగకపోవడం బాధించిందని చెప్పారు. లోక్‌సభ ప్రతిష్ఠను తగ్గించేలా ప్లకార్డులు ప్రదర్శించారని ఆయన అన్నారు.
లోక్‌సభలో 20 కీలక బిల్లులకు ఆమోద ముద్ర పడిందని వివరించారు. ఓబీసీ బిల్లుకు అన్ని పార్టీలు సహకరించాయని చెప్పారు. వర్షాకాల సమావేశాలు మొత్తం 21 గంటల 14 నిమిషాల పాటు జరిగాయని వివరించారు. కాగా, లోక్‌సభ సమావేశాలు జులై 19 నుంచి నేటి వరకు జరిగాయి. 19 రోజులు జరగాల్సి ఉండగా, షెడ్యూల్ కన్నా రెండు రోజుల ముందే ముగిశాయి.