దేశ భద్రతతో ముడిపడిన సమాచారాన్ని అడగడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్య
పెగాసస్ గూఢచర్యంపై స్వతంత్ర దర్యాప్తు జరుపాలంటూ దాఖలైన పిటిషన్లపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలను వెల్లడించమని ప్రభుత్వాన్ని అడగడంలేదని స్పష్టం చేస్తూ సంబంధిత అధికార సంస్థ అఫిడవిట్ దాఖలు చేయడానికి ‘సమస్య’ ఏమిటని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ ప్రశ్నించింది. ఇజ్రాయెల్ సంస్థ ఎన్‌ఎస్‌వోకు చెందిన పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించారా లేదా అఫిడవిట్‌లో వెల్లడించడమనేది దేశ భద్రతతో ముడిపడిన అంశమని ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. దానివల్ల ఉగ్రవాద కార్యకలాపాల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులు దొరక్కుండా జాగ్రత్తపడే ప్రమాదముందన్నారు. దీనిపై కోర్టు స్పందిస్తూ దేశ భద్రతకు సంబంధించిన ఒక్క పదం కూడా అఫిడవిట్‌లో వెల్లడించాలని తాము కోరుకోవడం లేదని తెలిపింది. తమ ఫోన్లను స్పైవేర్‌తో ట్యాపింగ్ చేశారన్న పిటిషనర్ల ఆరోపణను ప్రస్తావించింది. ‘ఈ పిటిషన్లపై ప్రభుత్వానికి నోటీసు జారీ చేస్తాం. సమాచారాన్ని ఎంతవరకు వెల్లడించవచ్చనే అంశంపై సంబంధిత అధికార సంస్థ నిర్ణయం తీసుకుంటుంది. తర్వాత ఏం చేయాలనేది తెలుస్తుంది’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
భార్యకే విడాకులు.. పిల్లలకు కాదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, ఆగస్టు 17: ‘మీరు మీ భార్యకు విడాకులు ఇవ్వగలరు గానీ జన్మనిచ్చిన పిల్లలకు కాదు. వారి సంరక్షణ బాధ్యతను తీసుకోవాల్సిందే’ అని సుప్రీంకోర్టు ఓ వ్యక్తిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. విడాకుల కేసులో భార్యకు, మైనర్లు అయిన పిల్లలకు మెయింటెనెన్స్ కింద రూ.4 కోట్లు ఇవ్వాలని అతనిని ఆదేశించింది. 2019 నుంచి వేర్వేరుగా ఉంటున్న దంపతులకు వారి పరస్పర అంగీకారంతో సుప్రీంకోర్టు విడాకులు మంజూరు చేసింది. కరోనా వల్ల వ్యాపారం దెబ్బతినడంతో ముందుగా ఒప్పుకున్నట్లు రూ.4 కోట్లు వెంటనే ఇవ్వలేనని సదరు వ్యక్తి తెలిపాడు. ఇలా మాట మార్చడం తగదంటూ సెప్టెంబర్ 1లోగా రూ.కోటి, 30లోగా మిగతా రూ.3 కోట్లు వారికి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
జడ్జిల భద్రతకు ప్రత్యేక దళం సాధ్యం కాదు: కేంద్రం
న్యూఢిల్లీ, ఆగస్టు 17: దేశవ్యాప్తంగా జడ్జిలకు రక్షణ కల్పించడానికి సీఐఎస్‌ఎఫ్, ఆర్పీఎఫ్ వంటి జాతీయస్థాయి భద్రతా దళాన్ని నియమించడం ఆచరణ సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జడ్జిల భద్రత కోసం రాష్ర్టాలు ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని 2007లో కేంద్రం మార్గదర్శకాలు జారీచేసిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో అదనపు సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య నేపథ్యంలో దేశంలో జడ్జిలు, కోర్టుల భద్రత అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటో కేసుగా విచారణ చేపట్టింది. ఈ విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టారో తెలియజేయాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల రాష్ర్టాలను ఆదేశించింది. పలు రాష్ర్టాలు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారంలో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.