US Big mistakes in Afghan | సరిగ్గా 20 ఏండ్ల క్రితం ఆల్‌ఖైదాను, దానికి ఆశ్రయం కల్పించిన తాలిబన్లను మట్టుబెట్టే లక్ష్యంతో ఆఫ్ఘనిస్థాన్‌లో 2001లో సైనిక చర్యకు దిగింది అమెరికా. కానీ అగ్రరాజ్య సేనలు వీడగానే మొత్తం తాలిబన్లు శరవేగంగా ఆఫ్ఘన్‌ను కైవసం చేసుకున్నారు. ఈ తరుణంలో అమెరికా తన పాత్ర గురించి ఆత్మ పరిశోధన చేసుకోవాల్సి ఉంది. 46 ఏండ్ల క్రితం వియత్నాంలోని కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైనిక చర్యకు దిగిన అమెరికా 1975లో సైగోన్‌లో ఘోర పరాజయం పాలైంది. ఆఫ్ఘన్‌పై తిరిగి తాలిబన్లు పట్టు సాధించడంతో అగ్రరాజ్య శిబిరంలో నిరాశా నిస్ప్రుహలు చోటు చేసుకున్నాయి.
లక్ష్యాల సాధనలో అమెరికా తప్పటడుగులు ఇలా
9/11 ఉగ్రదాడులకు అల్‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్‌దే బాధ్యత. ఆఫ్ఘన్ భూభాగంపై నుంచి దాడులు చేశారన్న ఆగ్రహంతో 2001లో ఆఫ్ఘన్‌లో అడుగు పెట్టింది అమెరికా.. ఉగ్రవాద సంస్థ, దానికి ఆశ్రయం కల్పించిన ఆఫ్ఘన్ తాలిబన్ సర్కార్‌ను శిక్షించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. కానీ అగ్రరాజ్యం నేరుగా ముందుకు సాగలేదన్న విమర్శ ఉంది. తాలిబన్లను కట్టడి చేశాక జాతి నిర్మాణం.. మహిళలకు విముక్తి కల్పన లక్ష్యాలు జత కలిశాయి.
విఫలమైన ప్రజాస్వామిక పరివర్తన లక్ష్యం
ఆఫ్ఘనిస్తానీయులు పూర్తిగా పశుపోషణపై ఆధారపడి జీవించేవారు. అంతే కాదు మెజారిటీ జనాభా పురాతన కాలపు ఆంక్షల మధ్య నివసించే వారు. వారిలో లింగ సమానత్వం.. చట్టాల పట్ల గౌరవం.. మానవ హక్కుల పరిరక్షణతో కూడిన ప్రజాస్వామ్యం పట్ల ఎలా పరివర్తన తీసుకు రాగలరన్నది సందేహంగా ఉంది. నెపోలియన్ విదేశీ మంత్రి చార్లెస్ మారైస్ డీ తల్లేర్యాండ్ పెరిగోడ్ మాటల్లో చెప్పాలంటే ఆఫ్ఘన్‌లో అమెరికా చర్యలు నేరాల కంటే దారుణం.. ఒక పెద్ద తప్పిదం..
పాక్‌తో డీల్ రెండో తప్పిదం..
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లను కట్టడి చేయడానికి పాకిస్థాన్‌తో అమెరికా డీల్ కుదుర్చుకున్నది. కానీ అమెరికా ప్లాన్‌కనుగుణంగా పాకిస్థాన్ వ్యవహరించలేదు. అమెరికా డిమాండ్లపై పాకిస్థాన్ సైనిక జనరల్స్ తమకంటూ ద్వేషపూరిత ప్రణాళిక అమలు చేశారు. 9/11 దాడులు జరిగిన మూడు నెలల్లోపే భారత్ పార్లమెంట్‌పై పాక్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదులు దాడులు చేయగలిగారు. భారత్ సరిహద్దుల్లో సంక్షోభాన్ని నివారించగలిగి ఉంటే.. పాక్ తన సైన్యం మద్దతుతో ఆఫ్ఘన్‌లో అమెరికా లక్ష్యాల సాధనకు అండగా నిలిచేదన్న అభిప్రాయం వినిపిస్తున్నది. ఉపఖండంలో భారత్ సైన్యం ఆధిపత్యాన్ని అడ్డుకోవాలంటే తమకు ఉగ్రవాదుల అండ అవసరమని అమెరికాను పాక్ నమ్మించగలిగింది. ఆఫ్ఘన్‌పై పట్టు కోసం పాకిస్థాన్ సాకులకు అమెరికా తలొగ్గాల్సి వచ్చింది.
ఆఫ్ఘన్‌లో ఏండ్ల తరబడి తిష్ట
జాతి నిర్మాణం పేరిట కొన్నేండ్ల తరబడి ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా సేనలు తిష్ఠ వేయడం మరో తప్పిదం. అమెరికా మిత్రదేశంగా ఉన్న పాకిస్థాన్.. తన శక్తియుక్తులన్నీ భారత్‌కు వ్యతిరేకంగా పోరాడటానికే ఉపయోగించింది. దీని ప్రభావం ఆఫ్ఘన్‌లో అమెరికా సేనలకు ప్రతికూల పరిణామాలకు దారి తీసింది. ఆఫ్ఘన్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పూర్తిగా పాక్‌పైనే అమెరికా ఆధారపడటం మొదటికే మోసానికి కారణమైంది. తాలిబన్లను ఏరివేయడమే లక్ష్యంగా అమెరికా పని చేసిందే తప్ప.. దానికి పాక్‌లో మూలాలు ఉన్నాయన్న సంగతిని విస్మరించింది.
సైన్యంపై దాడులకు పాక్ పాత్ర ఉన్నా..
తమ సైన్యంపై దాడుల్లో పాక్ ప్రభుత్వ భాగస్వామ్యం ఉందని రుజువులు లభించినా అమెరికా ఏమీ చేయలేకపోయింది. పాక్ మిలిటరీ అకాడమీకి కూతవేటు దూరంలో దాక్కుకున్న ఒసామాబిన్ లాడెన్‌ను తుదముట్టించిన అమెరికా.. కీలుబొమ్మ.. దాని సూత్రధారి ఎవరన్న విషయాన్ని నిర్ధారించలేకపోయింది.
దక్షిణాసియా పట్టని ట్రంప్ పాలన
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. పశ్చిమాసియా దేశాలతో సంబంధాలకే ప్రాధాన్యం ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి. పాక్-ఆఫ్ఘన్ పాలసీపై అమెరికా అధినేతలు కబుర్లు చెప్పడం తప్ప చేసిందేమీ లేదు. దక్షిణాసియా దేశాలతో సంబంధాలను ట్రంప్ పట్టించుకోనే లేదు.
కీలుబొమ్మ అధినేతలతో మొదటికే మోసం..
ఆఫ్ఘన్‌లో పరిస్థితులను మెరుగు పర్చగల సామర్థ్యం లేని హమీద్ కర్జాయి, అశ్రఫ్ ఘనీ వంటి నేతలను ముందుకు తీసుకొచ్చి అమెరికా మరో పెద్ద పొరపాటు చేసింది. సుతిమెత్తని వ్యక్తులుగా వారిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయా.. లేదా.. అన్న సంగతిని విస్మరించింది అమెరికా. నిత్యం ఉగ్రవాదంతో అట్టుడుకుతున్న దేశంలో పాలన ఎలా సాగించాలన్న వ్యూహం.. క్లూ గానీ లేవు. స్వీయ భ్రమలతోపాటు బలగాల్లో పునరుత్తేజం నింపడంలో విఫలమైన దరిమిలా.. అమెరికా ఓటమి పాలైందన్న విమర్శలు ఉన్నాయి.